హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాల సందర్భంగా మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న పోకిరీలపై షీ టీమ్స్ ఉక్కుపాదం మోపాయి. తొమ్మిది రోజుల వ్యవధిలో 930 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నాయి. పవిత్రమైన ఉత్సవ వాతావరణంలో అల్లరి పనులకు పాల్పడుతున్న వారి ఆటకట్టించాయి.
గణేష్ నవరాత్రుల సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు, ముఖ్యంగా మహిళలు, యువతులు తరలివస్తున్నారు. ఈ రద్దీని ఆసరాగా చేసుకుని కొందరు ఆకతాయిలు వారిని ఉద్దేశపూర్వకంగా తాకడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. దీనిపై దృష్టి సారించిన షీ టీమ్స్, మఫ్టీలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆకతాయిల భరతం పట్టాయి.
పోలీసులు జరిపిన ఈ ఆపరేషన్‌లో పట్టుబడిన వారిలో 55 మంది మైనర్లు ఉన్నారు. మహిళలను వేధిస్తూ, వారిని ఇబ్బందులకు గురిచేస్తున్న సమయంలో వీరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఖైరతాబాద్ మహాగణపతి మండపం పరిసరాల్లో 15 మంది షీ టీమ్స్‌తో నిఘా ఏర్పాటు చేశారు. నిమజ్జనం సమయంలో ఎవరైనా ఆకతాయిలు వేధిస్తే డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.