ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా వైసీపీ విష ప్రచారం చేస్తోందని, ఇలాగే కొనసాగితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా హెచ్చరించారు. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఏవైనా ఆధారాలు ఉంటే వాటిని బయటపెట్టాలని ఆమె సవాల్ విసిరారు. అలా ఆధారాలు చూపించలేని పక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్’ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు.
ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిన వైసీపీ… ఇప్పుడు ప్రభుత్వంపై నిర్లక్ష్యంగా బురద జల్లడమే పనిగా పెట్టుకుందని అనిత విమర్శించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం కించపరిచే ఉద్దేశంతో నేతలపై దుష్ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. కల్పిత కథనాలను, అబద్ధాలను ప్రచారం చేయడాన్ని వాక్ స్వాతంత్ర్యంగా పరిగణించలేమని ఆమె తేల్చి చెప్పారు. తాము ఎప్పుడూ న్యాయమైన రాజకీయ చర్చను స్వాగతిస్తామని, కానీ ఉద్దేశపూర్వకంగా చేసే అసత్య ప్రచారాలను మాత్రం సహించే ప్రసక్తే లేదని ఆమె పేర్కొన్నారు.
“ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాన్ని సహించేది లేదు. న్యాయమైన రాజకీయ చర్చను మేం స్వాగతిస్తాం. కానీ ఉద్దేశపూర్వక అబద్ధాలపై చట్టం పూర్తిస్థాయిలో కఠినంగా వ్యవహరిస్తుంది” అని మంత్రి అనిత తన పోస్టులో స్పష్టం చేశారు.