కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టుపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోం శాఖకు అధికారికంగా లేఖ రాసింది. కాళేశ్వరంపై నియమించిన జ్యుడీషియల్ కమిషన్ సమర్పించిన నివేదికను ఆధారం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీకి చేరినట్లయింది.
కాళేశ్వరం కమిషన్ తన నివేదికలో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ పనులకు చెల్లించిన బిల్లులు, ఆ నిధులు చివరికి ఎవరెవరికి చేరాయన్న దానిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. అంతేకాకుండా, కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పాత్రపైన కూడా విచారణ జరపాలని కమిషన్ సిఫారసు చేసింది. ఈ ప్రాజెక్టులో కేంద్ర, రాష్ట్రాలకు చెందిన అనేక శాఖల ప్రమేయం ఉన్నందున, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తేనే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం తన లేఖలో పేర్కొంది.
తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్ర హోం శాఖ ఆమోదిస్తే, కాళేశ్వరం బ్యారేజీలపై సీబీఐ దర్యాప్తు మొదలవుతుంది. ఈ పరిణామంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. సీబీఐ దర్యాప్తు విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.