క్యాన్సర్ రోగుల కష్టాలకు చెక్.. జిల్లా కేంద్రాల్లోనే కీమోథెరపీ

V. Sai Krishna Reddy
2 Min Read

క్యాన్సర్ చికిత్స కోసం సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ప్రయాణించి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులకు తెలంగాణ ప్రభుత్వం ఊరట కల్పించనుంది. ఇకపై కీమోథెరపీ కోసం రోగులు రాజధానికి రావాల్సిన అవసరం లేకుండా, వారి సొంత జిల్లాల్లోనే చికిత్స అందించేందుకు కీలక ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 34 బోధనాస్పత్రుల్లో ‘డే కేర్ క్యాన్సర్ సెంటర్ల’ (డీసీసీసీ)ను ఏర్పాటు చేయాలని ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు.

ప్రముఖ క్యాన్సర్ నిపుణుడు, ప్రభుత్వ వైద్య సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఇటీవల చేసిన సూచనల మేరకు వైద్యారోగ్య శాఖ ఈ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ కొత్త విధానం ప్రకారం క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారికి జిల్లా కేంద్రాల్లోనే ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. వ్యాధి నిర్ధారణ అయితే, హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే ఆస్పత్రికి రిఫర్ చేస్తారు. అక్కడ తొలి విడత కీమోథెరపీ పూర్తయ్యాక, మిగతా చికిత్స కోసం వారిని సొంత జిల్లాలోని డే కేర్ సెంటర్‌కు పంపిస్తారు. దీనివల్ల రోగులకు ప్రయాణ భారం, ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.

ప్రతి కేంద్రంలో 20 పడకలు ఉంటాయి. వీటిలో 10 కీమోథెరపీ కోసం, మిగిలిన 10 పాలియేటివ్ కేర్ (ఉపశమన చికిత్స) కోసం కేటాయిస్తారు. కీమోథెరపీ బాధ్యతలను జనరల్ సర్జన్లు, పాలియేటివ్ కేర్ బాధ్యతలను అనస్థీషియా వైద్యులు పర్యవేక్షిస్తారు. రాష్ట్రంలో 27 కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.40.23 కోట్లు మంజూరు చేయగా, మిగిలిన 7 కేంద్రాలను రాష్ట్ర నిధులతో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

ఎంఎన్‌జేలో చిన్నారుల కోసం ప్రత్యేక యూనిట్
హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో చిన్నారుల కోసం ప్రత్యేకంగా ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీడియాట్రిక్ ఆంకాలజీ’ ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. డాక్టర్ నోరి దత్తాత్రేయుడి సూచనల మేరకు ఈ ప్రతిపాదనను సిద్ధం చేశారు. ప్రస్తుతం పిల్లల కోసం ఉన్న 120 పడకలు నిరంతరం నిండిపోతున్నందున, ఆసుపత్రి ఆవరణలోనే 500 పడకలతో ప్రత్యేక బ్లాక్ నిర్మించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ప్రభుత్వం అనుమతిస్తే, ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎంఎన్‌జే డైరెక్టర్ డాక్టర్ ఎం. శ్రీనివాసులు తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *