తెలంగాణ పోలీసు శాఖలో మహిళా అధికారుల భాగస్వామ్యం జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 764 పోలీస్ స్టేషన్లలో మహిళా సిబ్బంది వాటా కేవలం 8.6 శాతంగానే ఉండగా, జాతీయ స్థాయిలో ఇది 12.32 శాతంగా ఉంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ సదస్సులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో 21, 22 తేదీలలో ‘పోలీసుల్లో మహిళలు: లింగ సమానత్వ పోలీసింగ్ దిశగా చారిత్రక అడుగు’ అనే అంశంపై రెండు రోజుల పాటు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో లింగ వివక్ష, పదోన్నతుల్లో పరిమిత అవకాశాలు, సరైన మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడం, పని ప్రదేశంలో వేధింపులు, సుదీర్ఘ పని గంటలు వంటి సవాళ్లను పలువురు ప్రస్తావించారు. ఈ సదస్సు ముగింపు సందర్భంగా పోలీసు శాఖలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడంతో పాటు, వారికి మెరుగైన అవకాశాలు, సౌకర్యాలు కల్పించేందుకు పలు తక్షణ, దీర్ఘకాలిక సంస్కరణలను ప్రతిపాదించారు.
సదస్సులో చేసిన కీలక సిఫార్సులు
రాష్ట్ర, జిల్లా, పోలీస్ స్టేషన్ స్థాయిల్లోని అధికారులకు తప్పనిసరిగా జెండర్ సెన్సిటైజేషన్ (లింగ సమానత్వంపై అవగాహన)పై శిక్షణ ఇవ్వాలి.
మహిళా కానిస్టేబుల్ (డబ్ల్యూపీసీ), మహిళా ఎస్సై (డబ్ల్యూఎస్సై) వంటి లింగ-నిర్దిష్ట హోదాలను దశలవారీగా తొలగించి, అన్ని ర్యాంకుల్లో ఒకే రకమైన పేరును అమలు చేయాలి.
ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు, మహిళల ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు కీలకమైన ట్రాఫిక్ విధుల్లో వారిని నియమించాలి.
అన్ని ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమాల్లో మహిళలకు కనీసం 10 శాతం ప్రాతినిధ్యం కల్పించి, క్రమంగా దాన్ని పెంచాలి.
ప్రతి యూనిట్ లేదా జోన్‌లో కనీసం ఒక మహిళా ఎస్‌హెచ్‌వో ఉండేలా మహిళా, సాధారణ పోలీస్ స్టేషన్లలో నిర్దిష్ట శాతాన్ని రిజర్వ్ చేయాలి.
మహిళా ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లకు దర్యాప్తు, సైబర్ క్రైమ్, నార్కోటిక్స్, అల్లర్ల నివారణ వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.