కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో శనివారం నిర్వహించిన మహాగర్జన సన్నాహక సభలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పింఛన్ ధరలు తక్కువగా ఉన్నాయని మంద కృష్ణ మాదిగ అన్నారు. చంద్రబాబు ఎన్నికల హామీ ప్రకారం దివ్యాంగులకు రూ.6 వేలు, వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, కండరాల క్షీణతతో బాధపడే వారికి రూ.15 వేల వరకు పింఛన్లు అందిస్తున్నారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలైనా పింఛన్ పెంపు ప్రకటన చేయకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.
ప్రతిసారి ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీ వంటి సంఘాలు ఉద్యమాలు చేస్తేనే ప్రభుత్వాలు స్పందిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజా పోరాటాల ద్వారా మాత్రమే న్యాయం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మంద కృష్ణ మాదిగ ప్రకటించారు. ఈ సభకు దివ్యాంగులు, పింఛన్ దారులు అధిక సంఖ్యలో హాజరై తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ, జిల్లా అధ్యక్షుడు సాయిలు తదితరులు పాల్గొన్నారు