అమెరికా చరిత్రలో గత యాభై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వలసదారుల జనాభా గణనీయంగా తగ్గింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠినమైన వలస విధానాల ఫలితంగా ఈ మార్పు చోటుచేసుకుందని ప్యూ రీసెర్చ్ సెంటర్ డేటా వెల్లడించింది. ఈ పరిణామం అగ్రరాజ్యంలో వలసల సరళిలో వస్తున్న పెనుమార్పులకు సంకేతంగా నిలుస్తోంది.
నివేదికల ప్రకారం, 2025 ప్రథమార్ధంలోనే దేశంలో వలసదారుల సంఖ్య ఏకంగా 14 లక్షల మేర తగ్గింది. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టే నాటికి 5.33 కోట్లుగా ఉన్న వలసదారుల సంఖ్య, ఇప్పుడు 5.19 కోట్లకు పడిపోయిందని న్యూయార్క్ పోస్ట్ కథనం పేర్కొంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన సరిహద్దు భద్రతా చర్యలు, భారీ స్థాయిలో దేశ బహిష్కరణలు, వలసదారులు స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లడమే ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలని తెలుస్తోంది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ప్రకారం, సుమారు 16 లక్షల మంది వలసదారులు సొంతంగా అమెరికాను వీడారు. మరోవైపు, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) కేవలం 200 రోజుల్లోనే 3,32,000 మందికి పైగా అక్రమ వలసదారులను వారి దేశాలకు పంపించివేసింది. దీంతోపాటు, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, చికాగో వంటి నగరాల్లో 3,59,000 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు.
ట్రంప్ ప్రభుత్వం అక్రమ సరిహద్దు చొరబాట్లను దాదాపు పూర్తిగా అరికట్టింది. నెలకు 5,000 కంటే తక్కువ స్థాయికి చొరబాట్లను నియంత్రించింది. అంతేకాకుండా ఆశ్రయం కోరేవారికి, వీసా హోల్డర్లకు, విదేశీ విద్యార్థులకు నిబంధనలను కఠినతరం చేసింది. వీసా గడువు ముగిసినా దేశంలో ఉండటం, నేర కార్యకలాపాలకు పాల్పడటం వంటి ఉల్లంఘనలపై నిరంతర నిఘా పెట్టి, నిబంధనలు ఉల్లంఘించిన వారిని వెంటనే దేశం విడిచి వెళ్ళేలా చర్యలు తీసుకుంటోంది.
ఈ తగ్గుదల ఉన్నప్పటికీ, ప్రస్తుతం అమెరికా జనాభాలో వలసదారుల వాటా 15.4 శాతంగా ఉంది. ఏటా 10 లక్షల మంది అక్రమ వలసదారులను బహిష్కరించాలని ఐసీఈ లక్ష్యంగా పెట్టుకున్నా, రోజుకు 3,000 అరెస్టుల లక్ష్యాన్ని చేరుకోవడం సవాలుగా మారింది. ఏదేమైనా, గత 50 ఏళ్లలో తొలిసారిగా దేశంలో “నెగటివ్ నెట్ మైగ్రేషన్” నమోదైందని అధ్యక్షుడు ట్రంప్ ఈ పరిణామాన్ని స్వాగతించారు.