ఆత్మకూరు / ప్రజాజ్యోతి:
- స్నేహబంధానికి నిదర్శనంగా అంత్యక్రియల్లో పాల్గొని దహన కార్యక్రమం నిర్వహించిన క్లాస్ మేట్స్
తమతో పాటు చదువుకున్న చిన్న నాటి స్నేహితుడు అనారోగ్యంతో మృతి చెందాడు. ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉన్న వారి కుటుంబానికి దహన కార్యక్రమం చేసే స్తొమత లేదు. విషయం తెలుసుకున్న చిన్న నాటి స్నేహితులు ఒక్కటై తమ స్నేహితునికి దహన కార్యక్రమాలు నిర్వహించారు. పూర్తి ఖర్చులు భరించి తమ స్నేహానికి ఉన్న విలువను సమాజానికి చాటి చెప్పారు. వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రం జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1996-97 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న మేడిపల్లి రాజేష్ (40) శనివారం రోజున అనారోగ్యంతో మృతి చెందాడు. అతని కుటుంబ పరిస్థితి ఆర్థికంగా ఎంతో వెనుకబడింది. కనీసం దహన కార్యక్రమాలు నిర్వహించడానికి ఎంతో ఇబ్బంది పడుతున్న క్రమంలో రాజేష్ తో పాటు చదువుకున్న తోటి సహచర విద్యార్థులు అంతా ఒక్కటై కొంత డబ్బులు వేసుకొని దాహన కార్యక్రమాలు పూర్తి చేశారు. సహ విద్యార్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మిత్రుడిని చివరి యాత్రలో తాము తోడుగా ఉండాలని భావించి, అతని అంత్యక్రియలకు హాజరై దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కన్నీటి కళ్లతో తాము చివరి వీడ్కోలు పలికిన సహవిద్యార్థి జ్ఞాపకాలు ఎల్లప్పుడూ తమతోనే ఉంటాయని స్నేహితులు తెలిపారు. పూర్వ విద్యార్థులు వంగాల భగవాన్ రెడ్డి, బూర బాలకృష్ణ, తోట దేవేందర్, లక్కర్స్ కుమార్ స్వామి, నంద్యాల రాజమౌళి, దండబోయిన రమేష్, కందికొండ మల్లికార్జున్, నామతాబాజీ సతీష్, బలభద్ర జితేందర్, ఓరుగంటి కరుణాకర్ రెడ్డి, తాళ్ల మహేందర్ తదితరులు దహన కార్యక్రమాలకు సహాయం అందచేశారు. భవిషత్తులో రాజేష్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.
