ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి వరద ఉద్ధృతిని తక్కువగా అంచనా వేసి కారుతో రోడ్డు దాటే ప్రయత్నం చేయగా, అది నీటిలో కొట్టుకుపోయిన ఘటన శనివారం చోటుచేసుకుంది. అయితే, అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
గత కొన్ని రోజులుగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తూ జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో, కోజా కాలనీకి చెందిన ఓ వ్యక్తి తన కారులో బయటకు వచ్చాడు. కాలనీలోని రోడ్డుపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ, దాన్ని దాటేందుకు ప్రయత్నించాడు.
కొంత దూరం వెళ్లాక వరద ప్రవాహం తీవ్రం కావడంతో కారు ముందుకు కదలలేక నీటిలోనే నిలిచిపోయింది. పరిస్థితి ప్రమాదకరంగా మారుతోందని గమనించిన ఆ వ్యక్తి, వెంటనే అప్రమత్తమై కారు దిగి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నాడు. అతను బయటకు వచ్చిన కొద్ది క్షణాల్లోనే, వరద ఉద్ధృ తికి కారు కాస్తా కాగితపు పడవలా కొట్టుకుపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.