ఎట్టకేలకు సాకారమైన జర్నలిస్టుల కల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ

V. Sai Krishna Reddy
2 Min Read

మాట నిలుపుకున్న ఎమ్మెల్యే బి ఎల్ ఆర్

సబ్ కలెక్టర్ అమిత్ అద్భుత కృషి

ఎట్టకేలకు సాకారమైన జర్నలిస్టుల కల

ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ

మిర్యాలగూడ, ఆగస్టు 15,(ప్రజాజ్యోతి):

దశాబ్ద కాలంగా ఇండ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న మిర్యాలగూడ జర్నలిస్టుల కల సాకారమయ్యింది… ఫ్లోర్ లీడర్ గా మాట ఇచ్చి… ఎమ్మెల్యేగా ఇచ్చిన మాట నిలుపుకొని,విలేఖరుల కలను సాకారం చేశారు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్)… విధి నిర్వహణలో తనకు తానే సాటిగా… ప్రజాసేవలో నిమగ్నమైన స్థానిక సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ జర్నలిస్టుల కలను సాకారం చేసేందుకు అమోఘమైన కృషిని చేశారు… స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా మిర్యాలగూడ లో దాదాపు 88 మంది విలేకరులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేశారు. నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్,డీఎస్పీ రాజశేఖర్ రాజు లతో కలిసి విలేకరులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ విలేకరుల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నఎమ్మెల్యే ,ఎమ్మెల్సీ , సబ్ కలెక్టర్ల ను ప్రత్యేకంగా అభినందించారు.విలేకరులకు ఎల్లవేళలా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు.ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ అనేక ప్రజా సమస్యల పరిష్కారంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న విలేకరులకు ఇళ్ల స్థలాలు అందజేయాలంటూ ఎప్పటినుండో ప్రభుత్వాలకు విన్నవిస్తూ వస్తున్నారని, గతంలో తాను ఫ్లోర్ లీడర్ గా ఉన్నప్పుడు విలేకరులు చేస్తున్న ఆందోళనలకు మద్దతు తెలిపి తాను అధికారంలోకి వస్తే పంపిణీ చేస్తానని మాట ఇచ్చానని, అన్నమాట ప్రకారం పట్టాలు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకుపోతుందని, విలేకరుల సంక్షేమం కోసం తాము నిరంతరం పనిచేస్తామన్నారు. మిర్యాలగూడ అభివృద్ధిలో పార్టీలకతీతంగా అందరూ కలిసి రావాలని కోరారు. ఎంపీ రఘువీర్ రెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్, స్థానిక అధికారుల సహకారంతో మిర్యాలగూడ ను అభివృద్ధి పథంలో తీసుకుపోతామని అన్నారు. ఇంకా ప్లాట్లు అందనివారు ఎలాంటి దిగులు పడోద్దని, కొద్ది రోజుల్లోనే మిగిలిన అందరికీ న్యాయం చేస్తామన్నారు. సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ మాట్లాడుతూ విలేకరులకు ఇళ్ల స్థలాల పంపిణీ చేసేందుకు రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా గొప్ప నిర్ణయం తీసుకున్నామని, దీనికి స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్, ఎమ్మెల్సీ శంకర్ నాయకులు పూర్తి సహకారం అందించడంతో పట్టాల పంపిణీ సాధ్యపడిందన్నారు. ఇదే చొరవ తో ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేసి అన్ని సౌకర్యాలతో జర్నలిస్టు కాలనీ ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మాట తప్పినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి విలేకరులకు ఇళ్ల స్థలాలు అందజేయటం హర్షణీయమన్నారు. ఈ పంపిణీలో కృషిచేసిన ఎమ్మెల్యే బిఎల్ఆర్ సబ్ కలెక్టర్ నారాయణ అమితులను ప్రత్యేకంగా అభినందించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *