స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువతకు శుభవార్త అందించారు. వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో లక్ష కోట్ల రూపాయల బడ్జెట్తో ‘వికసిత్ భారత్ రోజ్గార్ యోజన’ అనే ప్రతిష్ఠాత్మక పథకాన్ని ఎర్రకోట నుంచి ప్రకటించారు. ఈ పథకం ద్వారా తొలిసారిగా ప్రైవేటు రంగంలో ఉద్యోగం పొందిన యువతీయువకులకు ప్రభుత్వం నేరుగా రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తుందని స్పష్టం చేశారు.
దేశ యువతకు ఓ పెద్ద శుభవార్త ఉంది. నా దేశ యువత కోసం ఈ రోజు లక్ష కోట్ల రూపాయల పథకాన్ని ప్రారంభిస్తున్నాం” అని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ పథకం ఆగస్టు 15 నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. యువతకు తొలి ఉద్యోగంలో అడుగుపెట్టేందుకు ఈ ప్రోత్సాహకం ఎంతో తోడ్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ పథకం కేవలం ఉద్యోగులకే కాకుండా, కొత్త ఉద్యోగాలను సృష్టించే ప్రైవేటు కంపెనీలకు కూడా ప్రయోజనం చేకూర్చనుంది. కొత్తగా సిబ్బందిని నియమించుకునే సంస్థలకు, ఒక్కో కొత్త ఉద్యోగికి నెలకు రూ.3,000 వరకు ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తుంది. ముఖ్యంగా తయారీ రంగంలోని కంపెనీలకు ఈ ప్రయోజనాలు మరింత ఎక్కువగా ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.
