ప్రతిజ్ఞ రచయితను మరిచిపోయామా…?
— పాఠశాలల్లో రోజూ ఉదయం ప్రార్ధనా..!
(ఆగష్టు 13: పైడిమర్రి వర్ధంతి)
— గుమ్మడి లక్ష్మీనారాయణ,సామాజిక రచయిత,
రామారెడ్డి ఆగస్టు 12 (ప్రజా జ్యోతి)
సమయంలో విద్యార్థులు – వందేమాతరంతో పాటు ‘భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులూ…’ అనే ప్రతిజ్ఞ చేసిన తర్వాత రోజూవారీ బోధనా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. కాని ఇంత గొప్ప దేశభక్తిని నింపే ప్రతిజ్ఞ అక్షర శిల్పి పేరు మాత్రం వెలుగులోకి రాలేదు. మన జాతీయగీతం జనగణమన, జాతీయ గేయం వందేమాతరం, సమైక్యతాగీతం సారే జహాసే ఆచ్చా.. వంటి గీతాలు భారతదేశ నైసర్గిక స్వరూపాన్ని, ఉనికిని అద్భుతంగా వర్ణించాయి. అలాగే ప్రతిజ్ఞ కూడా మనదేశ భౌగోళిక స్వరూపంతో పాటు ప్రజల స్థితిగతులను వర్ణించింది. విద్యార్థులలో అత్యంత దేశభక్తిని నింపుతున్న ప్రతిజ్ఞను నాయకులు, విజ్ఞులు సత్వరమే గుర్తించలేక పోయారా! ఆ రచయిత ఎవరో ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని శతాబ్దాల పాటు తెలుసుకునే ప్రయత్నం జరుగకపోవడం విస్మయానికి గురి చేసింది.
తెలంగాణ ప్రభుత్వం 2015లో..!
ప్రతిజ్ఞ రచయిత పేరును పాఠ్యపుస్తకాల్లో ముద్రించింది. ఆ రచయిత పేరు పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఆయన నల్లగొండ జిల్లా అన్నేపర్తి అనే గ్రామంలో రాంబాయమ్మ, రామయ్య దంపతులకు 1916, జూన్ 10న జన్మించాడు. వీరి విద్యాభ్యాసం నల్లగొండ పట్టణంలోనే జరిగింది. జాతీయ ప్రతిజ్ఞ రాసిన పైడిమర్రి తెలంగాణ వాసి కావడం గర్వకారణం. ఎటువంటి గుర్తింపు లభించని వీరి కుటుంబీకులు నల్ల గొండలోనే ఉంటున్నారు. పైడిమర్రి సతీమణి వెంకట రత్నమ్మ 2013లో అనారోగ్యంతో మరణించింది. పైడిమర్రి అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో ప్రభుత్వ ఖజానా శాఖలో ప్రభుత్వోద్యోగిగా చేరి, ఉపకోశాధికారి (ఎస్.టి.వో)గా పనిచేశారు. ట్రెజరి శాఖలో విశాఖపట్నం, నెల్లూరు, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలో పనిచేసి 1971లో నల్లగొండలో జిల్లా కోశాధికారి (డి.టి. వో)గా పదవీ విరమణ చేశారు. 1962 చైనా యుద్ధ సమయంలో, వీరు విశాఖపట్టణంలో ఉపకోశాధికారిగా విధులు నిర్వహిస్తుండగా చైనా విద్యార్థులు, యువకులు దేశభక్తికి కారణం వారి పాఠ్యాంశాలలో దేశభక్తిని పెంపొందించే అంశాలను పరిశీలించారు. మన విద్యార్థులకు కూడా అలాంటి దేశభక్తి అవసరమని భావించి ప్రతిజ్ఞకు రూపకల్పన చేశాడు. తను రాసిన దానిని కవి మిత్రుడు, ప్రముఖ సాహితీవేత్త తెన్నేటి విశ్వనాథానికి చూపించి దానిపై చర్చించారు. ఆ ప్రతిజ్ఞను తెన్నేటి విశ్వనాథంగారు అప్పటి విద్యాశాఖామంత్రి, సాహితీవేత్త అయిన పి.వి.రాజుకు సమర్పించారు. పైడిమర్రి ప్రతిజ్ఞ ఖచ్చితంగా దేశభక్తిని చాటి చెబుతుందని ధీమాతో నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డితో పి.వి.రాజు చర్చించారు.
1963లో ముఖ్యమంత్రి ప్రతిజ్ఞను…!
ప్రతి పాఠ్యపుస్తకాల్లో చేర్చే విధంగా ఉత్తర్వులు జారీ చేశారు. 1965 తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రతిజ్ఞను ఆంగ్లంలో ముద్రించి, ఆ తర్వాత మిగతా భారతీయ భాషలన్నింటిలోనూ తర్జుమా చేసి పాఠ్యపుస్తకాల్లో (సెకండరీస్థాయి) ముద్రించి దేశవ్యాప్తంగా జాతీయ ప్రతిజ్ఞగా అమలు చేశారు. కాని ఈ పేరు విషయం పైడిమర్రికి తెలియదు. కారణం రచయిత పేరు ముద్రించబడలేదు. 1987లో తన మనవరాలు 3వ తరగతి పాఠ్యపుస్తకంలో ‘ప్రతిజ్ఞ’ కంఠస్తం చేస్తుంటే విని ఆశ్చర్యపోయాడు. తను రాసిన దానిని నోట్ బుక్ లో వెతికి సరి
చూసుకున్నాడు. తను రాసిన ప్రతిజ్ఞలోని పదాలను కొన్నింటిని యధాతధంగా సవరించి, అమలు చేస్తున్నట్లుగా గమనించి తన కుటుంబ సభ్యులకుతెలియజేశాడు. పైడిమర్రి నిరాడంబరుడు, నిగర్వి. ప్రచారం అంటే గిట్టని అసాధారణ వ్యక్తిత్వం గల సాదాసీదా తెలంగాణ మనిషి. జనగణమన, వందేమాతరం తర్వాత అంతే ఆదరణ కలిగిన ప్రతిజ్ఞ, ఎందరో భావి భారత నిర్మాతలుగా తీర్చిదిద్దుతున్న దేశభక్తి గీతం అయినా, ఆ రచయిత పేరును విస్తృత పరచడం వెనుక అంతర్యమేమిటో! లేదా ఆయన తెలంగాణలో పుట్టిన పాపమో, శాపమో తెలియరాలేదు. 2010-12లో నల్లగొండ కథలు రాసే క్రమంలో రచయిత ఎలికట్టె శంకర్రావు పైడిమర్రి ఇంటికి వెళ్లినపుడు ఆయన కుటుంబీకుల ద్వారా ప్రతిజ్ఞ గురించి తెలిసింది. ఆ తర్వాత పత్రికలు, టీవి ఛానళ్ల ద్వారా పైడిమర్రి పేరు బహిర్గతమైంది. ఆ రచయిత శంకర్రావు ‘ప్రతిజ్ఞ పదశిల్పి పైడిమర్రి’ గా పుస్తకరూపం చేశారు.
2012-13లోవిశాఖపట్టణంలో ప్రతిజ్ఞకు అర్ధశతాబ్ది ఉత్సవాలు జరిపారట! ఎందుకంటే పైడిమర్రి 1963లో అక్కడే ఎస్టీవోగా పని చేస్తున్నప్పుడే ప్రతిజ్ఞ రాశారు. కాని రచయిత పేరును గానీ, అతడు తెలంగాణ వాడనీగాని ప్రస్తావనే రాలేదు. గురజాడ దేశభక్తి గేయం ‘దేశమును ప్రేమించుమన్నా..’ కంటే సుబ్బారావు రాసిన ‘భారతదేశం నా మాతృభూమి..’ అనే ప్రతిజ్ఞ దేశభక్తిలో తక్కువేమీ కాదు. అందుకే – భారత ప్రభుత్వం జీవవైవిధ్యంపై ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నదనడానికి ఉదాహరణగా ప్రభుత్వం ప్రతిజ్ఞలోనూ ‘జంతువుల పట్ల దయతో ఉంటాను’ అనే వాక్యాన్ని చేర్చింది. కాని – రచయిత పేరును పాఠ్యపుస్తకాల్లో ముద్రించకపోవడం రాష్ట్ర విద్యాశాఖకే విస్మయం కలిగించింది. పైడిమర్రి ఒకవేళ ఆంధ్రాలో పుట్టి ఉంటే ప్రభుత్వం బిరుదులు, సత్కారాలు ఇచ్చి జయంతి, వర్ధంతి ఉత్సవాలు ఘనంగా జరిపేదేమో!
పైడిమర్రి మంచి రచయిత..!
బహుభాషావేత్త, ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ, పారసీ, సంస్కృతం భాషలలో ప్రావీణ్యం ఉంది. ఆయన 18వ ఏటనే ‘కాలభైరవుడు’ (1936) నవల రాశారు. దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు వంటి పద్యకావ్యాలు, బ్రహ్మచర్యము, గృహస్థ జీవితము, స్రీధర్మము, తార, శ్రీమతి అనే నాటకాలు రాశారు. సింగపురీ నృకేసరి శతకం, బాల రామాయణం, వెంకటేశ్వర స్తుతి మొదలైన రచనలు మరికొన్ని అనువాద రచనలు కూడా చేశారు. అప్పటి గోలకొండ, సుజాత, ఆంధ్రపత్రిక, భారతి, నవజీవన్, ఆనందవాణి పత్రికలలో వీరి రచనలు ప్రచురితమైనవి. వీరి పద్యాలు గోలకొండ కవుల సంచికలలోను, కధలు (నౌకరి) ఉషస్సు కధాసంకలనంలో వచ్చింది. నల్లగొండలో 1945-46లో జరిగిన ఆంధ్రసారస్వత పరిషత్తు సభలలో కీలక పాత్ర పోషించారు. పైడిమర్రి 1971లో పదవీ విరమణ పొందిన తర్వాత ఆం.ప్ర. గురుకుల పాఠశాల, సర్వేలలో కొంతకాలం స్వచ్ఛందంగా పనిచేశారు. 1977-1988 మధ్య నల్లగొండ పార్కులో ఉచిత హోమియో వైద్య సేవలందించారు. ఆయన 1988, ఆగస్టు 13న అకాల మరణం పొందారు. మనమంతా భారతీయులమని ఘనంగా చాటిచెప్పడానికి ఆస్కారమున్న అతి కొద్ది గీతాలలో ప్రతిజ్ఞ ఒకటి. పాఠ్యపుస్తకాలలో గత అయిదు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా ముద్రింపబడుతూ ఉన్నది. రచయిత పేరు మాత్రమే అముద్రితము.
దేశభక్తుడు, ప్రతిభాశీలి, సృజనశీలి…!
యైన సుబ్బారావుకు సరైన గుర్తింపు సకాలంలో రాకపోవడానికి మొదట పాఠ్యపుస్తక నిపుణుల కమిటీ, తర్వాత ఉమ్మడి రాష్ట్ర విద్యాశాఖ నిర్లక్ష్యమే కారణం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాతనైనా మేధావులు మేల్కొని పైడిమర్రి పేరు ‘ప్రతిజ్ఞ’ రచయితగా పాఠ్యపుస్తకాల్లో 2015లో చేర్చినందుకు యావత్తు తెలంగాణ గర్వించింది. పాఠశాల విద్యార్థులతో పాటు ప్రజలలో కూడా ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద భావాలు పెరగాలంటే వందేమాతరం, జనగణమనతో పాటు ప్రతిజ్ఞ కూడా ముఖ్య సందర్భాలలో ఆలపించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలి. అలాగే విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే ప్రయత్నం చేసిన ప్రతిజ్ఞ పైడిమర్రి సుబ్బారావు జయంతి అయిన జూన్ 10 తేదీన ‘భారత ఆత్మగౌరవ’ లేదా ‘దేశ ఐక్యతా దినోత్సవం’గా పాటించడం సముచిత. అదే పైడిమర్రికి తగిన గుర్తింపు ఇచ్చినట్లవుతుంది.