ఖమ్మం నగరంలోని ఓ అపార్ట్మెంట్లో పగటిపూట దొంగతనం జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. బొమ్మరిల్లు అపార్ట్మెంట్లోని నాల్గవ అంతస్తులో చోటు చేసుకున్న ఈ ఘటనలో నగదు, నగలు అపహరణకు గురయ్యాయి.
పోలీసుల కథనం ప్రకారం, ‘నెలనెలా.. వెన్నెల’ సాంస్కృతిక సంస్థ నిర్వాహకుడు కె. దేవేంద్ర బొమ్మరిల్లు అపార్ట్మెంట్లోని నాల్గవ అంతస్తులో నివాసం ఉంటున్నారు. ఆయన అర్ధాంగి, విశ్రాంత ఉపాధ్యాయురాలు ఝాన్సీ ఇటీవల అమెరికా వెళ్లారు. దేవేంద్ర నిన్న ఓ స్నేహితుడి ఇంటికి భోజనానికి వెళ్లారు.
మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు అపార్ట్మెంట్లోని ఆయన ఇంటి గేటు, తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలో ఉన్న 18 తులాల బంగారం, నగదు, డాలర్లు, ఇతర విలువైన వస్తువులను అపహరించుకుని వెళ్లారు. మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో పనిమనిషి దీనిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. పట్టపగలే అపార్ట్మెంట్లో చోరీ జరగడంతో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు