బ్యాంకు పొదుపు ఖాతాల్లో కనీస సగటు బ్యాలెన్స్ (మినిమమ్ బ్యాలెన్స్) పరిమితిని నిర్ణయించుకునే స్వేచ్ఛ పూర్తిగా ఆయా బ్యాంకులకే ఉంటుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఈ విషయం తమ నియంత్రణ పరిధిలోకి రాదని ఆయన తేల్చిచెప్పారు. దేశంలోని రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ, కొత్త ఖాతాదారులకు కనీస బ్యాలెన్స్ పరిమితిని భారీగా పెంచిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సోమవారం గుజరాత్‌లో జరిగిన ఒక ఆర్థిక సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్ మల్హోత్రా, ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త నిబంధనలపై మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. “కనీస బ్యాలెన్స్‌ను ఎంత ఉంచాలనేది బ్యాంకుల విచక్షణకే వదిలేశాం. కొన్ని బ్యాంకులు ఈ పరిమితిని రూ.10,000గా నిర్ణయిస్తే, మరికొన్ని రూ.2,000గా ఉంచాయి. చాలా బ్యాంకులు ఈ నిబంధనను పూర్తిగా తొలగించాయి కూడా,” అని ఆయన వివరించారు.
ఐసీఐసీఐ కొత్త నిబంధనలు ఇవే
ఐసీఐసీఐ బ్యాంక్ జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం, ఆగస్టు 1 తర్వాత ఖాతా తెరిచిన వారు భారీ మొత్తంలో కనీస సగటు బ్యాలెన్స్‌ను పాటించాల్సి ఉంటుంది.
మెట్రో, పట్టణ ప్రాంతాల కస్టమర్లు నెలకు సగటున రూ. 50,000 నిర్వహించాలి.
సెమీ-అర్బన్ (పట్టణాలకు సమీప ప్రాంతాలు) కస్టమర్లు రూ. 25,000 పాటించాలి.
గ్రామీణ ప్రాంతాల వారు రూ. 10,000 కనీస బ్యాలెన్స్ కలిగి ఉండాలి.
అయితే, పాత కస్టమర్లకు మునుపటి నిబంధనలే వర్తిస్తాయి. మెట్రో, పట్టణ ప్రాంతాల్లో రూ.10,000, గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో రూ.5,000గా పాత పరిమితులు కొనసాగుతాయి. కనీస బ్యాలెన్స్ పాటించని వారి నుంచి తగ్గిన మొత్తంలో 6% లేదా రూ. 500 (ఈ రెండింటిలో ఏది తక్కువైతే అది) జరిమానాగా వసూలు చేస్తారు. అంతేకాకుండా, నెలకు మూడుసార్లు మాత్రమే ఉచితంగా నగదు డిపాజిట్ చేయవచ్చని, ఆ తర్వాత ప్రతి లావాదేవీకి రూ.150 ఛార్జీ విధిస్తామని బ్యాంక్ ప్రకటించింది.
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 2020లోనే కనీస బ్యాలెన్స్ నిబంధనను రద్దు చేసింది. చాలా ఇతర బ్యాంకులు కూడా రూ. 2,000 నుంచి రూ. 10,000 మధ్య తక్కువ పరిమితులనే కొనసాగిస్తుండగా, ఐసీఐసీఐ నిర్ణయం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది.