కర్ణాటకలోని బెంగళూరులో పద్నాలుగేళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెబ్ సిరీస్ ప్రభావంతోనే బాలుడు ఈ పని చేసినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఓటీటీలో వచ్చే జపనీస్ వెబ్ సిరీస్ ను తమ కొడుకు క్రమం తప్పకుండా చూసేవాడని, చివరకు ఆ సిరీస్ లో పాత్రల ప్రభావంతో బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే..
బెంగళూరుకు చెందిన గాంధార్ అనే బాలుడు జపనీస్ వెబ్ సిరీస్ ఒకదానిని క్రమం తప్పకుండా చూసేవాడు. తన గది గోడలపై ఆ వెబ్ సిరీస్ లోని ఓ పాత్ర బొమ్మను చిత్రించాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి భోజనం చేశాక కాసేపు పెంపుడు కుక్కతో ఆడుకున్నాడు. ఆపై తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ రాసిన సూసైడ్ నోట్ లో.. ‘నేను చనిపోయానని ఎవరూ ఏడవ వద్దు. పద్నాలుగేళ్లు మీతో సంతోషంగా గడిపాను. ఇక నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఈ ఇంటిని సంతోషాల నిలయంగా మార్చేందుకే ఈ పని చేస్తున్నాను. మీరు ఈ లేఖ చదివే సమయానికి నేను స్వర్గంలో ఉంటాను. నేను తెలిసీతెలియక చేసిన తప్పులకు నన్ను క్షమించండి’ అని రాసిపెట్టాడు. గాంధార్ బాగా చదివే పిల్లాడేనని, స్కూలులోనూ ఎవరితో గొడవపడలేదని పోలీసుల దర్యప్తులో తేలింది.
వెబ్ సిరీస్ ప్రభావం..
గాంధార్ చూసే జపనీస్ వెబ్ సిరీస్ అతీంద్రియ శక్తులు ఉన్న పాత్రలు ఉంటాయని, అందులోని హీరో తన మాయాపుస్తకంలో ఎవరి పేరు రాస్తే వారు చనిపోతారని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. చెడ్డవాళ్లని గుర్తిస్తూ వారు చనిపోవాలని హీరో తన పుస్తకంలో రాస్తుంటాడని చెప్పారు. ఈ సిరీస్ ప్రభావం వల్లే గాంధార్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు.