హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం.. హిమాయత్ సాగర్ గేటు ఎత్తివేత

V. Sai Krishna Reddy
2 Min Read

గురువారం సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన కుండపోత వర్షానికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. గంట వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో రోడ్లన్నీ నదులను తలపించాయి. ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు నీట మునిగి, నగరంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అధికారులు నగరవ్యాప్తంగా హెచ్చరికలు జారీ చేశారు.

ముఖ్యంగా ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఐటీ ఉద్యోగులు నాలుగు నుంచి ఐదు గంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకుని తీవ్ర అవస్థలు పడ్డారు. పలు కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరగా, కొన్నిచోట్ల ద్విచక్ర వాహనాలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. మల్కం చెరువు వద్ద నీరు నిలిచిపోవడంతో బయో డైవర్సిటీ నుంచి షేక్‌పేట మార్గంలో ప్రయాణించవద్దని, ప్రత్యామ్నాయంగా ఐకియా, కేబుల్ బ్రిడ్జి మార్గాలను ఉపయోగించుకోవాలని పోలీసులు సూచించారు.

పరిస్థితిని సమీక్షించేందుకు హైడ్రా (హెచ్‌వైడీఆర్ఏ) కమిషనర్ ఏ.వి. రంగనాథ్, ఇతర అధికారులు నీటమునిగిన ప్రాంతాలను పరిశీలించారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు శ్రమించారు.

ఢిల్లీ నుంచే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ జితేందర్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగాన్ని సంసిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తంగా ఉంచాలని సూచించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 12 సెం.మీ. వరకు వర్షపాతం నమోదైందని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, వర్షం సమయంలో కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండాలని, మ్యాన్‌హోల్ మూతలు తెరవొద్దని విజ్ఞప్తి చేశారు.

హిమాయత్ సాగర్ గేటు ఎత్తివేత

మరోవైపు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం 1762.70 అడుగులకు చేరింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా అధికారులు గురువారం రాత్రి ఒక గేటును ఒక అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నేప‌థ్యంలో మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. జీహెచ్‌ఎంసీ, పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని హెచ్‌ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *