రాబోయే రెండున్నరేళ్లలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని… అప్పుడు అందరి లెక్కలు సరిచేస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి పాలన విచిత్రంగా ఉందని… ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదని అన్నారు. యూరియా కోసం రైతులు కష్టపడాల్సి వస్తోందని చెప్పారు. రాష్ట్రంలో భూముల విలువలు పడిపోయాయని అన్నారు. బీఆర్ఎస్ పాలనా సమయంలో రేషన్ కార్టులు ఇవ్వలేదని ఐఏఎస్ అధికారులు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఐఏఎస్ అధికారులు రాజకీయాలు మాట్లాడటం సరికాదని అన్నారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రుణమాఫీ విషయంలో రేవంత్ ప్రభుత్వం విఫలమయిందని కేటీఆర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతుబంధును ప్రభుత్వం నిలిపివేస్తుందని చెప్పారు. కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని… అందుకే ఢిల్లీలో కూడా కేసీఆర్ నే విమర్శిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన మంచి పనులను తమ పార్టీ కార్యకర్తలు ప్రజలకు చెప్పలేకపోయారని… అందుకే ఓడిపోయామని చెప్పారు. కేసీఆర్ ను మళ్లీ సీఎం చేసుకునేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు