ఝార్ఖండ్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు అగ్రనేత హతమయ్యాడు. గుమ్లా జిల్లా కామ్‌డారా పోలీస్ స్టేషన్ పరిధిలోని చంగబాది ఉపర్టోలీలో భద్రతా బలగాలు సోదాలు నిర్వహిస్తుండగా, మావోయిస్టులకు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయని అధికారులు వెల్లడించారు.
ఈ కాల్పుల సమయంలో ముగ్గురు మావోయిస్టులు తప్పించుకుని పారిపోగా, ఒక మావోయిస్టు మృతి చెందాడని వారు తెలిపారు. మృతి చెందిన వ్యక్తిని పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా గ్రూపునకు చెందిన అగ్రనేత మార్కెన్ కెర్కెట్టాగా గుర్తించామని, అతనిపై రూ.15 లక్షల రివార్డు కూడా ఉందని అధికారులు పేర్కొన్నారు.
మార్కెన్‌పై ఏడు జిల్లాలలోని పోలీస్ స్టేషన్లలో దాదాపు 72 కేసులు నమోదై ఉన్నాయని అధికారులు తెలిపారు. తప్పించుకుని పారిపోయిన ముగ్గురు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వారు వెల్లడించారు.