అమెరికాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సేవలకు బుధవారం తీవ్ర అంతరాయం కలిగింది. సంస్థ కంప్యూటర్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపంతో అమెరికా వ్యాప్తంగా అన్ని ప్రధాన (మెయిన్‌లైన్) విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఈ ఘటనతో వందలాది విమానాలు ఆయా ఎయిర్ పోర్టులలోనే గంటల తరబడి నిలిచిపోయాయి.
దీంతో సర్వీసులు ఆలస్యం కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో నిరీక్షిస్తున్నారు. సమస్యను పరిష్కరించేలోగా మరిన్ని సర్వీసులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) కూడా రంగంలోకి దిగింది. షికాగో, డెన్వర్, హ్యూస్టన్, నెవార్క్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి ప్రధాన విమానాశ్రయాల నుంచి యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానాలు బయలుదేరకుండా ‘గ్రౌండ్ స్టాప్’ ఆదేశాలు జారీ చేసింది.
కాగా, ఇటీవలి కాలంలో సాంకేతిక లోపాలు అమెరికా విమానయాన రంగానికి తీవ్ర సమస్యగా మారాయి. గత నెలలో అలస్కా ఎయిర్‌లైన్స్‌లో ఐటీ సమస్య తలెత్తింది. దీంతో కొన్ని గంటల పాటు ఎయిర్‌పోర్టుల్లోనే తన విమానాలను నిలిపివేసింది. ఈ ఏడాది న్యూయార్క్ ప్రాంతంలోని విమానాశ్రయాల్లో ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లు పలు సార్లు నిలిచిపోయాయి.
ఇక, గత జనవరిలో వాషింగ్టన్‌లోని రీగన్ నేషనల్ విమానాశ్రయం సమీపంలో ప్రయాణికులతో వెళుతున్న విమానం.. సైనిక హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. దీంతో పదుల సంఖ్యలో ప్రయాణికులు మరణించిన విషయం తెలిసిందే