మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పట్ల కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరు పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ ఒక మహిళా శాసనసభ్యురాలి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు.
సాక్షాత్తు ఒక మంత్రి సమక్షంలో సబితపై కాంగ్రెస్ నేతలు గూండాల మాదిరి వ్యవహరిస్తూ బెదిరింపులకు పాల్పడుతుంటే… పోలీసులు వారితో కలిసి సబితపై దౌర్జన్యానికి పాల్పడటం దారుణమని అన్నారు. సబిత పట్ల అమర్యాదగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోంమంత్రిగా కూడా ఉన్న రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు. రౌడీ మూకల దాడులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదని చెప్పారు. ప్రజాక్షేత్రంలో మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని అన్నారు.