తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చోటు కోసం ఆశపడుతున్న విషయం విదితమే. మంత్రి పదవి విషయంలో తనకు పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఆయన పట్టుబడుతున్నారు. రాజకీయాల్లో తనకంటే జూనియర్లకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ తనకు అర్హత ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించారు. అవసరమైతే మరోసారి పదవీ త్యాగం చేయడానికి సిద్ధమేనని, కానీ పదవి కోసం తాను ఎవరి కాళ్లు పట్టుకోనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ అంశం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సోదరుడికి మంత్రి పదవి అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. నిన్న ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇప్పించే స్థితిలో తాను లేనని అన్నారు. మంత్రివర్గ నియామకం అనేది అధిష్ఠానం అనుమతితో జరుగుతుందని, అందులో ఎవరి ప్రమేయమూ ఉండదని ఆయన స్పష్టం చేశారు.
రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే సమయంలో మంత్రి పదవి ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్లు తనకు తెలియదని ఆయన అన్నారు. ఒకవేళ ఆ హామీ ప్రకారం పదవి ఇస్తే తాను సంతోషిస్తానని తెలిపారు. పార్టీలో సీనియర్ అయినప్పటికీ నిర్ణయాధికారాలు తన చేతుల్లో ఉండవని వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో బహిరంగంగా వ్యాఖ్యానించడంపై పార్టీ అధిష్ఠానం ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది