ఉత్తర కాశీలో జలప్రళయం… కొట్టుకుపోయిన గ్రామం

V. Sai Krishna Reddy
2 Min Read

దేవభూమి ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఉత్తరకాశీ జిల్లాలో మంగళవారం సంభవించిన కుండపోత వర్షం (క్లౌడ్ బరస్ట్) పెను విషాదాన్ని మిగిల్చింది. హర్సిల్ సమీపంలోని ధారాలీ ప్రాంతంలో ఆకస్మిక వరద పోటెత్తడంతో ఒక గ్రామం పూర్తిగా కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో పలువురు స్థానికులు గల్లంతైనట్లు సమాచారం అందడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ధారాలీ వద్ద ఉన్న ఖీర్ గధ్ వాగులో నీటిమట్టం ఒక్కసారిగా ప్రమాదకర స్థాయిలో పెరగడంతో వరద నీరు సమీపంలోని మార్కెట్ ప్రాంతాన్ని ముంచెత్తింది. దీనివల్ల తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీస్, అగ్నిమాపక శాఖ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), భారత సైన్యం రంగంలోకి దిగాయి. విపత్తు సహాయక బృందాలు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించాయి.

ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ధారాలీ ప్రాంతంలో కుండపోత వర్షం వల్ల జరిగిన నష్టం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, జిల్లా యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి” అని ఆయన ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. సీనియర్ అధికారులతో తాను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానని చెప్పారు. “అందరూ క్షేమంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు.

అధికారులు నదీ తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. నదులు, వాగుల వద్దకు వెళ్లవద్దని, పిల్లలు, పశువుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

కాగా, ఆగస్టు 4 నుంచి ఉత్తరకాశీ, పౌరీ గఢ్వాల్, టెహ్రీ, చమోలీ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఒకరోజు ముందే హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో డెహ్రాడూన్ జిల్లా యంత్రాంగం పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించింది. ముఖ్యమంత్రి ధామి కూడా అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ సమావేశం నిర్వహించి సంసిద్ధతను సమీక్షించారు. అయినప్పటికీ ఈ స్థాయిలో నష్టం జరగడం విచారకరం.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *