ప్రతిపక్షానికి ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతుంది అధికార పక్షం. మొన్న ఫోన్ ట్యాపింగ్, తాజాగా కాళేశ్వరం కమిషన్ అంటూ.. ముప్పేట దాడితో.. బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరవుతుంది. ఇదే అదునుగా ప్రత్యర్థి బీజేపీ సైతం తన పావులు కదుపుతోంది. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో గులాబీ నేతలకు గాలం వేసింది. తెలంగాణలో బీఆర్ఎస్‌కు గడ్డు కాలం నడుస్తుంది. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు కొనసాగుతుండగానే, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ రూపంలో బీఆర్ఎస్‌పై మరో పిడుగు పడింది. నేడో, రేపో స్థానిక ఎన్నికలంటూ హీట్ కొనసాగుతున్న వేళ.. వరుసగా బీఆర్ఎస్‌ను ఇబ్బంది పెట్టే అంశాలతో పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ముప్పేట దాడి కారణంగా.. తెలంగాణలో బర్నింగ్ టాపిక్ అయినటువంటి బీసీ రిజర్వేషన్ అంశంపై ఫోకస్ చేయలేకపోతుంది బీఆర్ఎస్.
నిన్న మొన్నటి వరకు ఈ కార్ రేసింగ్, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల పంపిణీ కేసులంటూ ఎటాకింగ్‌కు దిగిన కాంగ్రెస్.. తాజాగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌ను ప్రజల ముందుంచింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌లో బీఆర్ఎస్ పెద్ద తలకాయలను టార్గెట్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్, హరీష్‌రావు పేర్లు ప్రస్తావించింది కమిషన్. దీంతో.. రివర్స్ ఎటాక్‌కు దిగింది బీఆర్ఎస్. అది కమిషన్ రిపోర్ట్ కాదు.. కాంగ్రెస్ రిపోర్ట్ అని స్వయంగా కేసీఆరే విమర్శించారు. అంతేకాదు.. కమిషన్ రిపోర్ట్ పేరుతో జరిగే డ్యామేజీని కంట్రోల్ చేసేందుకు నాయకుల్ని రంగంలోకి దింపారు. ఇందులో భాగంగానే ఇవాళ హరీష్‌రావు ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. కమిషన్ పూర్తి రిపోర్ట్ బయటపెట్టకుండా.. కేసీఆర్ మీద నిందలు మోపడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శిస్తున్నారు. .మరోవైపు.. కాంగ్రెస్ ఎటాక్‌తో ఇబ్బందుల్లో ఉన్న బీఆర్ఎస్‌ను బీజేపీ కూడా దెబ్బ కొడుతుంది. బీఆర్ఎస్ లాయలిస్టులకు గాలాలు వేసి.. బీజేపీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నల్లమల ప్రాంతానికి చెందిన గువ్వల బాలరాజును తమ దారికి తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. రేపో, మాపో గువ్వల బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు. ఒక్క గువ్వలే కాదు.. మరికొందరు గులాబీ నేతలు కూడా బీజేపీలోకి రావడం గ్యారంటీ అంటున్నారు రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు. అధికార కాంగ్రెస్ ముప్పేట దాడితో సతమతం అవుతున్న బీఆర్ఎస్‌కు,.. బీజేపీ కంట్లో నలుసుగా మారింది. ఎప్పుడు ఏ నాయకుడికి ఎర వేస్తుందనే టెన్షన్‌లో ఉన్నారు గులాబీ నేతలు.
ఏదేమయినా.. కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలకు బీఆర్ఎస్‌పై కారు మేఘాలు కమ్మాయి. దీంతో.. రెండు పార్టీలకు స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తూ.. ప్రజలకు వాస్తవాలు వివరించే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు బీసీ కోటాపై బీఆర్ఎస్ స్టాండ్‌ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతుంది.