మెగాస్టార్ చిరంజీవి తన కోడలు ఉపాసన తెలంగాణ ప్రభుత్వ స్పోర్ట్స్ హబ్ కో-చైర్‌పర్సన్‌గా నియమితులైన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘మా కోడలు ఇప్పుడు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-చైర్‌పర్సన్’ అంటూ ఎంతో మురిసిపోయారు. ఈ మేరకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.
ఉపాసన నియామకం పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నానని చిరంజీవి పేర్కొన్నారు. ఈ పదవి ఒక గౌరవంతో పాటు గొప్ప బాధ్యత అని ఆయన అభిప్రాయపడ్డారు. క్రీడల పట్ల ఉపాసనకు ఉన్న అభిరుచి, నిబద్ధత గురించి ప్రస్తావిస్తూ ఆమె ఈ కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రియమైన ఉపాసన, నీ నిబద్ధత, అభిరుచితో మన రాష్ట్రంలోని అపారమైన క్రీడా ప్రతిభను వెలికితీయడంలో, వారిని ప్రోత్సహించడంలో ఎంతగానో దోహదపడతావని నేను కచ్చితంగా నమ్ముతున్నాను. క్రీడాకారులను అగ్రస్థానానికి చేర్చే విధానాల రూపకల్పనలో నీ పాత్ర కీలకం అవుతుంది. దేవుడి ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి” అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అటు, మెగా అభిమానులు, నెటిజన్లు కూడా ఉపాసనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.