బాలికపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన స్కూల్ కరస్పాండెంట్ అకుమర్తి జయరాజును పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా రాయవరం మండలంలో జరిగింది. రామచంద్రాపురం ట్రైనీ డీఎస్పీ పి. ప్రదీప్తి తెలిపిన వివరాల ప్రకారం..
రాయవరం మండలం మాచవరంలో మార్గదర్శి ఫౌండేషన్ పేరిట ప్రైవేటు పాఠశాలను జయరాజు నిర్వహిస్తున్నాడు. ఈ ఏడాది మార్చి 26న తరగతి గదిలో ఉన్న బాలికను అలమారాలో ఫైల్స్ తీయాలనే సాకుతో ఆఫీసు గదిలోకి రప్పించుకున్నాడు. ఫైల్స్ తీస్తుండగా, బాలికను పట్టుకుని లైంగికంగా వేధించి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాలిక భయపడి తనపై జరిగిన లైంగికదాడిని బహిర్గతం చేయలేకపోయింది.
ఇటీవల బాలికలో మార్పు కనబడటంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించగా అయిదో నెల గర్భవతిగా వైద్యులు ధ్రువీకరించారు. దీంతో హతాశులైన తల్లిదండ్రులు బాలికను గట్టిగా ప్రశ్నించగా కరస్పాండెంట్ చేసిన అఘాయిత్యం బయటపెట్టింది. దీంతో కీచక కరస్పాండెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 28న ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుతో పోలీసులు జయరాజుపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పరారీలో ఉన్న నిందితుడు జయరాజును రామచంద్రాపురం మండలం కొత్తూరు శివారు కూడలిలో నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కోర్టుకు హాజరుపర్చగా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు జైలుకు తరలించారు. నిందితుడిని చాకచక్యంగా అరెస్టు చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ బి. కృష్ణారావు, అదనపు ఎస్పీ ప్రసాద్, రామచంద్రాపురం డీఎస్పీ రఘువీర్ అభినందించారు.