మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో ఆగస్టు 1 నుంచి ‘నో హెల్మెట్ నో పెట్రోల్’ విధానం అమలులోకి రానుంది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా పెట్రోల్ పంపుకు వస్తే వారికి ఇంధనం నింపేందుకు అనుమతి నిరాకరించనున్నారు. ఎల్లుండి నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని జిల్లా అధికారులు వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను నియంత్రించేందుకు ఇండోర్ జిల్లా యంత్రాంగం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
రోడ్డు భద్రతా కమిటీ ఛైర్మన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించేలా, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టులు పెట్టుకునేలా ఇండోర్‌లో ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు ద్విచక్రవాహనదారులు హెల్మెట్ లేకుండా వస్తే పెట్రోల్ బంకుల్లో ఇంధనం నిరాకరించనున్నట్లు ఇండోర్ జిల్లా మెజిస్ట్రేట్ ఆశిష్ సింగ్ వెల్లడించారు.
ఆదేశాలు ఉల్లంఘిస్తే సంబంధిత పెట్రోల్ బంకులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఏడాది జైలు శిక్ష లేదా రూ. 5 వేల జరిమానా లేదా రెండూ విధించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇండోర్ రోడ్లపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.