హుజురాబాద్, జూలై 29, ప్రజా జ్యోతి :
రాష్ట్రంలోని ప్రజలందరి సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. మంగళవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…. కేసీఆర్, కేటీఆర్ మెప్పు పొందడానికే కౌశిక్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని, అభివృద్ధిని గాలికి వదిలేసి చిల్లర రాజకీయాల మీద కౌశిక్ రెడ్డి దృష్టి పెడితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్డిఎఫ్ ఫండ్ కింద పది కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి విద్య, వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, గడిచిన 18 నెలల్లో నియోజకవర్గంలోని ఐదు పాఠశాలలకు కోటి 13 లక్షల నిధులు వెచ్చించామని, గురుకుల పాఠశాలల్లో నీటి సమస్యlanu పరిష్కరించేందుకు కోటి రూపాయలు వెచ్చించామని అన్నారు. ఉప ఎన్నికల సమయంలో అడ్డగోలుగా ప్రొసీడింగులు ఇచ్చి తరువాత రెండేళ్లు విప్ గా, ఎమ్మెల్సీగా ఉండి కౌశిక్ రెడ్డి ఏం చేయలేక ఇప్పుడు ఆది కావాలి ఇది కావాలి అనడం విడ్డూరంగా ఉందన్నారు. నియోజకవర్గంలో కుల సంఘాలు,మహిళా భవనాలతో పాటు, ఆంజనేయస్వామి దేవాలయ ప్రహరీ, 20 లక్షలతో కమ్యూనిటీ హాలు ఏర్పాటుకు పనులు త్వరలో చేపడుతున్నామని అన్నారు. గతంలో ఇక్కడి నుండి నాయకత్వం వహించి ఉన్నత పదవులు అనుభవించిన వారు ఈ ప్రాంతంలో ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న పనులకు శ్రద్ధ చూపలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోక్షం కల్పిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వలన ఎంజెపి పాఠశాలలో గణనీయంగా విద్యార్థుల సంఖ్య పెరిగిందని, ఆయా మండలాలలో సొంత భవనాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంటున్నామని అన్నారు. డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచామని, పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పని కాంగ్రెస్ 18 నెలలలో చేసి చూపించిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత రవాణా సౌకర్యంలాంటివి తీసుకొచ్చిందని అన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదని బిఆర్ఎస్ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కళ్ళు ఉండి కూడా చూడలేని స్థితిలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత బస్సు ద్వారా కోటి 30 లక్షల టిక్కెట్లు మహిళలకు ఇవ్వగా 52 కోట్ల రూపాయలను ఆదా చేసుకున్నారని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ కూడా చేశామని, తొమ్మిది రోజులలో 9000 కోట్లు రైతు భరోసా ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదని అన్నారు. రైతులకు బోనస్ పూర్తిస్థాయిలో అందజేశామని ఈ సంవత్సరం కూడా అదే తరహాలో ఇస్తామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పులకు నెలకు 5,6 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుందని, అయినా భారం అనుకోకుండా పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేట్ హ్యాకర్లతో ఫోన్లు హ్యాకింగ్ చేయించామనడం సిగ్గుచేటని తెలిపారు. నిరాధార ఆరోపణలు చేసి అల్ప సంతోషం పొందే కౌశిక్ రెడ్డికి, ముఖ్యమంత్రి పై ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే బహిరంగంగానే గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఫోన్ హ్యాకింగ్ దేశంలోనే మొట్టమొదటగా మొదలుపెట్టింది బిఆర్ఎస్ పార్టీ అని, ఆది ఆధారాలతో సహా రుజువైందని గుర్తుచేశారు. కౌశిక్ రెడ్డి తన పెద్ద బాస్, చిన్న బాస్ ల మెప్పు పొందడానికి ఇదంతా చేస్తున్నాడని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డిని ఏం చేయలేకపోయారని, రేవంత్ రెడ్డి దమ్మేంటో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే చూపించారని, అంతగా తెలుసుకోవాలి అనుకుంటే కేసిఆర్, కేటీఆర్ అడిగితే చెప్తారని అన్నారు. రేవంత్ రెడ్డి వల్ల ఒకరు ఫామ్ హౌజ్ కు పరిమితం కాగా మరొకరు దేశాలు తిరుగుతున్నారని ఎద్దేవ చేశారు. ఇటీవల బిజెపి ఎంపీ సిఎం రమేష్ బిఆర్ఎస్ పార్టీని బిజెపిలో విలీనం చేస్తారని చెప్పడంతో కేటీఆర్ ఉలిక్కిపడుతున్నారనీ, అసలు బీజేపీ ఎంపీ ఇంటికి కేటీఆర్ ఎందుకు వెళ్ళాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ స్వంత లాభం కోసం పార్టీ విలీనానికి వెనకాడని కేటీఆర్ రాష్ట్ర ప్రయోజనాలను ఏం కాపాడుతారని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన, తెచ్చిన కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ ను సర్వతాముఖోభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు మేకల తిరుపతి, కొల్లూరి కిరణ్, మహిళా నాయకులు వేల్పుల పుష్పలత, లంక దాసరి లావణ్య, రాధ, సాయిని రవి, పొనగంటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
– సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
వివిధ కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి మంగళవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వోడితల ప్రణవ్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపించేశారు. నియోజకవర్గంలోని హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట, కమలాపూర్ మండలాలకు చెందిన 147 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.