జవాబుపత్రాలు దిద్దడంలో ప్రొఫెసర్ చేసిన చిన్న పొరపాటు కారణంగా ఏకంగా 138 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అయితే, ఓ విద్యార్థి ద్వారా తప్పిదాన్ని గుర్తించిన అధికారులు సరిచేసి ఫలితాలను ప్రకటించారు. ప్రొఫెసర్ జవాబుపత్రాలను దిద్దడంలో చేసిన పొరపాటును గుర్తించిన అధికారులు, వెంటనే సరిదిద్ది మరోసారి ప్రశ్నపత్రాలను దిద్దించగా ఫెయిల్ అయిన విద్యార్థులందరూ పాస్ అయ్యారు.
అసలేం జరిగిందంటే..!
గత నెలలో జేఎన్‌టీయూ నాలుగో ఏడాది రెండో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (ఈఐఏ) సబ్జెక్టు పరీక్షకు హాజరైన మల్లారెడ్డి, షాదన్, శ్రీదత్త కళాశాలలకు చెందిన సుమారు 138 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దాంతో శ్రీదత్త కాలేజీకి చెందిన ఓ స్టూడెంట్.. ఈఐఏ సబ్జెక్టులో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యే అవకాశం లేదని, మరోసారి ఫలితాలు చెక్ చేయాలని జేఎన్‌టీయూ పరీక్షల విభాగం అధికారులకు మెయిల్ చేశాడు.
విద్యార్థి అభ్యర్థన మేరకు అధికారులు ఫెయిల్ అయిన విద్యార్థుల జవాబుపత్రాలను మరోసారి పరిశీలించారు. దాంతో వారి జవాబుపత్రాలను దిద్దిన ప్రొఫెసర్ పొరపాటు చేసినట్లు గుర్తించారు. ఎగ్జామ్ ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్‌లో వేర్వేరు ప్రశ్నపత్రాలతో నిర్వహించారు.
అయితే, ప్రొఫెసర్ ఉదయం ప్రశ్నపత్రంతోనే సాయంత్రం జవాబు పత్రాలను కూడా దిద్దినట్లు గుర్తించారు. దాంతో వెంటనే సాయంత్రం ప్రశ్నపత్రంతో దిద్దించగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. గురువారం రాత్రి అధికారులు ఫలితాలను సరిచేసి ప్రకటించారు.