పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ మూవీ కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన విషయం తెలిసిందే. పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ రోజు మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత రాత్రి ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రస్తుతం బెనిఫిట్ షోలు నడుస్తున్నాయి.
ఇక, ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు, ఫ్యాన్స్ కొందరు మీడియాతో తమ అభిప్రాయాన్ని పంచుకోగా, మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. పవన్ యాక్షన్, ఎలివేషన్ సీన్లు ఎంతగానో ఆకట్టుకున్నాయని అభిమానులు చెబుతున్నారు. చారిత్రక కథను దర్శకులు క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ బాగా చూపించారని, మూవీ తమకు ఎక్కడా బోర్ కొట్టలేదని అంటున్నారు.
సమాజానికి మంచి సందేశం అందించేలా చిత్రాన్ని రూపొందించినందుకు కూడా ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పార్ట్1లో ప్రతీ పాత్రను కూడా మొదటి నుంచి ఎండింగ్ వరకు చాలా బాగా డిజైన్ చేశారని, పార్ట్ 2లో ఈ పాత్రలకి సంబంధించి ప్రతీదానికి వివరణ ఉంటుందని చెబుతున్నారు. కీరవాణి మ్యూజిక్ కూడా ఈ చిత్రానికి హైలెట్ అని అంటున్నారు. ఇలాంటి చారిత్రక చిత్రానికి పవన్ లాంటి నటుడే తగిన వాడని, ఈ పాత్రను ఆయన తప్ప మరెవ్వరూ పోషించలేరు అని కొనియాడుతున్నారు.