భారత పాస్‌పోర్టు శక్తి కాస్తంత మెరుగుపడింది. శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో భారత్ గత సంవత్సరంతో పోలిస్తే కొంత పురోగతి సాధించింది. వీసా రహిత ప్రయాణాలను అనుమతించే దేశాల సంఖ్య ఆధారంగా పాస్‌పోర్టు శక్తిని లెక్కిస్తారు. ఈ మేరకు హెన్లీ పాస్‌పోర్టు సూచీ 2024 విడుదలైంది.
ఈ సూచీలో సింగపూర్ 193 దేశాలకు వీసా రహిత ప్రయాణాలతో మొదటి స్థానంలో నిలవగా, జపాన్, దక్షిణ కొరియాలు సంయుక్తంగా రెండవ స్థానంలో ఉన్నాయి. డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, స్పెయిన్ దేశాలు మూడవ స్థానంలో ఉన్నాయి. గతంలో 80వ స్థానంలో ఉన్న భారత్ ప్రస్తుతం 77వ స్థానానికి చేరుకుంది.
భారత పాస్‌పోర్టుతో వీసా లేకుండా ప్రయాణించగలిగే దేశాల సంఖ్య 59కి పరిమితమైంది. గతంలో ఈ సంఖ్య 62గా ఉండేది. మలేషియా, ఇండోనేషియా, మాల్దీవులు, థాయ్‌లాండ్ వంటి దేశాలు భారతీయులకు వీసా రహిత ప్రయాణాలను అనుమతిస్తున్నాయి. శ్రీలంక, మకావు, మయన్మార్ మొదలైన దేశాలు మాత్రం అక్కడికి చేరుకున్న తర్వాత వీసాలు మంజూరు చేస్తున్నాయి.
ఈ జాబితాలో ఆఫ్ఘనిస్థాన్ చివరి స్థానంలో ఉంది. ఆ దేశ పాస్‌పోర్టుతో కేవలం 25 దేశాలకు మాత్రమే వీసా లేకుండా ప్రయాణించే అవకాశం ఉంది