ఉప రాష్ట్రపతి రేసులో ఆ నలుగురు

V. Sai Krishna Reddy
2 Min Read

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించడంతో తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఉపరాష్ట్రపతి పదవి రేసులో నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పేరు కూడా ఉంది. నితీశ్ కుమార్‌ను ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయడం కోసమే జగదీప్ ధన్‌ఖడ్‌తో రాజీనామా చేయించారనే వార్తలు వినిపిస్తున్నాయి. పలు ప్రతిపక్షాలు ఇదే విషయంపై ఆరోపణలు చేస్తున్నాయి. బీహార్‌లో సొంత పార్టీ నేతను సీఎం స్థానానికి ఎంపిక చేసి, నితీశ్ కుమార్ తనయుడికి ఉప ముఖ్యమంత్రి పదవి అప్పగించే ఆలోచనలో భాగంగా కేంద్రంలోని బీజేపీ జగదీప్ ధన్‌ఖడ్‌తో రాజీనామా చేయించిందని అంటున్నారు. అయితే తాను ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్లుగా జగదీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు.

మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి క్రమంగా దూరమవుతున్న సీనియర్ ఎంపీ శశిథరూర్ పేరు కూడా ఉపరాష్ట్రపతి రేసులో వినిపిస్తోంది. ఈయన త్వరలోనే కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి కమలదళంలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేరళలో సొంత పార్టీ నేతలే ఆయనను పక్కన పెట్టినట్లు ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ ఇద్దరితో పాటు ఢిల్లీ, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లలో ఒకరికి అవకాశం ఇవ్వవచ్చని కూడా వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గత మూడేళ్లుగా ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆప్ అధికారంలో ఉన్న సమయంలో అనేక విషయాల్లో నాటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో విభేదించి తరచూ వార్తల్లో నిలిచారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి ఎల్జీ సక్సేనాతో వివాదం కూడా ఒక కారణమని భావిస్తున్నారు. దీంతో ఆయన కేంద్రం దృష్టిలో పడ్డారు.

అలానే ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న సీనియర్ బీజేపీ నేత మనోజ్ సిన్హా పదవీ కాలం వచ్చే నెల 6వ తేదీతో ముగియనుంది. ఈయన గతంలో పార్టీ జాతీయ కౌన్సిల్‌లో సభ్యుడిగా వ్యవహరించడంతో పాటు మోదీ తొలి క్యాబినెట్‌లో కేంద్ర సహాయ మంత్రిగానూ పని చేశారు. ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన సిన్హా పాలనలో తనదైన ముద్ర వేశారు. ఈ క్రమంలో సిన్హా పేరు కూడా ఉపరాష్ట్రపతి రేసులో వినిపిస్తోంది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *