ఆదాయపు పన్ను మినహాయింపు విషయంలో కాంగ్రెస్ పార్టీకి మరోసారి నిరాశ ఎదురైంది. రూ. 199 కోట్ల విరాళాలపై పన్ను మినహాయింపు కోరుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన విజ్ఞప్తిని ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఐటీఏటీ) తిరస్కరించింది. రిటర్నులు ఆలస్యంగా దాఖలు చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని, చట్టం ప్రకారం మొత్తం ఆదాయానికి పన్ను చెల్లించాలని స్పష్టం చేసింది.
2017-18 సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు గడువు తేదీ 2018 డిసెంబర్ 31తో ముగిసింది. కాంగ్రెస్ పార్టీ నిర్ణీత గడువులోగా రిటర్నులు దాఖలు చేయడంలో విఫలమైంది. ఆ పార్టీ 2019 ఫిబ్రవరి 2న రిటర్నులు దాఖలు చేస్తూ, రూ. 199 కోట్లు పన్నుల రూపంలో వచ్చాయని పేర్కొంటూ పన్ను మినహాయింపు కోరింది.
2019లో ఐటీ అధికారులు పరిశీలన జరిపినప్పుడు, దాతల నుంచి అధిక మొత్తంలో విరాళాలు స్వీకరించినట్లు గుర్తించారు. ఒక్కొక్కరి నుంచి గరిష్ఠంగా రూ. 2 వేల వరకు మాత్రమే విరాళం తీసుకోవాల్సి ఉండగా, రూ. 14.49 లక్షలను నగదు రూపంలో స్వీకరించినట్లు కనుగొన్నారు.
దీంతో ఐటీ శాఖ పన్ను మినహాయింపు విజ్ఞప్తిని తిరస్కరించింది. ఆ మొత్తానికి పన్ను చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని కమిషన్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ (అప్పీల్స్) సమర్థించింది. కాంగ్రెస్ పార్టీ ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రైబ్యునల్‌కు వెళ్లినప్పటికీ అక్కడ కూడా ప్రతికూల ఫలితమే ఎదురైంది