హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మరోవైపు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటించారు. ప్యాట్నీ నాలా వద్ద నీట మునిగిన ప్రాంతంలో డీఆర్ఎఫ్ పడవ సాయంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రంగనాథ్ స్వయంగా పడవలో వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.
సాగర్‌కు భారీగా వరద నీరు
హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షానికి హుస్సేన్ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 514 అడుగులు కాగా, ప్రస్తుతం 513 అడుగులకు చేరింది. భారీ వర్షానికి భాగ్యనగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. డీఆర్ఎఫ్, హైడ్రా, అగ్నిమాపక, ట్రాఫిక్ సిబ్బంది బోట్ల సాయంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు వాటిని క్లియర్ చేస్తున్నారు.
నగరంలో ఈరోజు కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మారేడ్‌పల్లి పికెట్ ప్రాంతంలో 11.28 సెంటీమీటర్ల వర్షం, మారేడ్‌పల్లి, బాలానగర్, బండ్లగూడ, ముషీరాబాద్‌లో 11 సెంటీమీటర్లు, బోయినపల్లిలో 11.10, నాచారంలో 10.05, ఉప్పల్, మల్కాజ్‌గిరిలలో 10, ఓయూలో 8.95, జవహర్ నగర్‌లో 8, కూకట్‌పల్లిలో 7.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది.