తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పాలన చేస్తున్నారా లేక ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారా అనేది అర్థం కావడం లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసుదనాచారి అన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళితే బొంకులు, హైదరాబాద్‌లో ఉంటే రంకులు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి శ్వేతపత్రాల సామ్రాట్ అని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి అయ్యాక శ్వేతపత్రాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను బలి చేయడానికే ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల సమావేశంలో బనకచర్ల అంశం రాలేదని అబద్ధాలు చెప్పారని, అయినా అడ్డంగా దొరకడం ముఖ్యమంత్రికి కొత్తేమీ కాదని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి రహస్య ఎజెండాతో పని చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని నిరుద్యోగులు ఓటు వేస్తే, వారిని కూడా మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్‌లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారిపోయాయని తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని అన్నారు.