ఇరాక్ అల్-కుత్ నగరంలోని ఒక హైపర్‌మార్కెట్‌లో గత రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 50 మంది మరణించినట్టు వాసిత్ ప్రావిన్స్ గవర్నర్ మొహమ్మద్ అల్-మియాహిని ఉటంకిస్తూ పలు వార్తా సంస్థలు నివేదించాయి. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న వీడియోల్లో భవనంలోని ఓ పెద్ద భాగం మంటల్లో చిక్కుకుంది. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అయితే, ఈ వీడియోను ధ్రువీకరించాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రాథమిక దర్యాప్తు ఫలితాలు రెండు రోజుల్లో వస్తాయని ఇరాన్ ప్రభుత్వ సంస్థ ఐఎన్ఏ తెలిపింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిలో ఎక్కువమంది పిల్లలు ఉన్నట్టు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.