హైదరాబాద్ నాంపల్లిలోని ఓ పాడుబడిన ఇంట్లో అస్థిపంజరం బయటపడిన విషయం తెలిసిందే. అయితే, ఆ అస్థిపంజరం చుట్టూ నెలకొన్న మిస్టరీని ఓ పాత ఫోన్ తేల్చేసింది. మృతుడు ఆ ఇంటి యజమాని మునీర్ ఖాన్ కొడుకు అమీర్ ఖాన్ అని నిర్ధారించింది. అస్థిపంజరం చుట్టుపక్కల ఎలాంటి రక్తపు మరకలు కానీ, పెనుగులాట జరిగిన గుర్తులు కానీ దొరకకపోవడంతో అమీర్ మరణం సహజంగానే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. అమీర్ ఖాన్ బహుశా మానసిక సమస్యలతో బాధపడి ఉండొచ్చని చెప్పారు.
తోబుట్టువులు ఆయన గురించి పట్టించుకోకపోవడం వల్లే అమీర్ చనిపోయిన విషయం బయటపడలేదన్నారు. దాదాపు పదేళ్ల కిందే అమీర్ చనిపోయి ఉంటాడని పోలీసులు తెలిపారు. కాగా, స్థానిక యువకుడు ఒకరు తన మొబైల్ లో తీసిన వీడియో వైరల్ కావడంతో ఈ అస్థిపంజరం విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అస్థిపంజరంను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించి ఆ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఇంట్లో ఓ పాత నోకియా ఫోన్, మంచం దిండు కింద కొంత పాత కరెన్సీ లభించాయని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా నోకియా ఫోన్ ను మరమ్మతు చేసి ఆన్ చేయగా, అందులో 84 మిస్సడ్ కాల్స్ ఉన్నాయని గుర్తించారు. అవన్నీ 2015లో వచ్చినట్లు గుర్తించారు. ఈ ఫోన్ ద్వారా అస్థిపంజరం అమీర్ ఖాన్ దేనని నిర్ధారించినట్లు పోలీసులు వివరించారు. కాగా, అమీర్ ఖాన్ కు పదిమంది తోబుట్టువులు ఉన్నారని, వారిలో కొందరు విదేశాలలో స్థిరపడ్డారని పోలీసులు తెలిపారు. వారిలో ఒకరు స్థానికంగానే ఉంటున్నప్పటికీ అమీర్ ఖాన్ ను పట్టించుకోలేదని వెల్లడించారు.