గోల్డెన్ వీసా ఆఫర్ చేస్తున్న 9 దేశాలు ఇవే

V. Sai Krishna Reddy
4 Min Read

విదేశాల్లో స్థిరపడాలనే వారికి బంపర్ ఆఫర్
నిర్ణీత మొత్తం పెట్టుబడి పెడితే పౌరసత్వం
భార్యాపిల్లలతో పాటు తల్లిదండ్రులనూ తీసుకెళ్లే వీలు
విదేశాల్లో స్థిరపడాలనే కోరిక మనలో చాలామందికి ఉంటుంది. కానీ వెళ్లే మార్గమే కనిపించదు. ఉన్నత చదువుల కోసమో, ఉద్యోగం కోసమో విదేశాలకు వెళ్లి అక్కడే సెటిలవ్వడం ఓ మార్గం. చాలామంది ఇలాగే విదేశాల్లో సెటిలవుతుంటారు. అయితే, ఈ పద్ధతిలో విదేశాలకు వెళ్లే అవకాశం కొందరికే ఉంటుంది. ఈ అవకాశం లేని వారికి కొన్ని దేశాలు కల్పించిన బంపర్ ఆఫర్ పేరే ‘గోల్డెన్ వీసా’.. అంటే డబ్బులు వెచ్చించి ఆ దేశ పౌరసత్వాన్ని కొనుక్కోవడం అన్నమాట. ఈ పద్ధతి కాస్త ఖరీదైనదే కానీ మరో మార్గం లేనివారికి ఇదొక చక్కని అవకాశమనే చెప్పవచ్చు.

గోల్డెన్ వీసా ప్రయోజనాలేంటంటే..
వీసాతో పనిలేకుండా చాలా దేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది
భార్యాపిల్లలతో పాటు తల్లిదండ్రులనూ తీసుకువెళ్లే అవకాశం
కొన్ని దేశాల గోల్డెన్ వీసాతో పన్నుల భారం తగ్గించుకునే వీలు
నిర్ణీత కాలం నివాసం ఉండడం లేదా నిర్ణీత మొత్తం చెల్లించడం ద్వారా ఆ దేశ పౌరసత్వం పొందే అవకాశం
ముఖ్యంగా మెరుగైన జీవనశైలి.. ఆరోగ్యకరమైన వాతావరణం, అత్యున్నత వైద్య సదుపాయాలు, విద్య పొందవచ్చు
కొన్ని దేశాల్లో అయితే గోల్డెన్ వీసా కొనుక్కున్నాక మీరు అక్కడే తప్పనిసరిగా ఉండాలనే నియమం ఏదీ పెట్టడంలేదు. అంటే మాతృదేశంలో ఉంటూనే నిర్ణీత కాలం తర్వాత విదేశీ పౌరసత్వం పొంది ఆ దేశానికి వెళ్లి స్థిరపడవచ్చు

గోల్డెన్ వీసా ఆఫర్ చేస్తున్న 9 దేశాలు, వీసా కోసం ఎంత వెచ్చించాలనే వివరాలు..

1 లాత్వియా
లాత్వియా ఆఫర్ చేస్తున్న గోల్డెన్ వీసా పొందాలంటే 60 వేల యూరోలు (కాస్త అటూఇటూగా 60 లక్షలు) చెల్లించాలి. ఈ మొత్తాన్ని లాత్వియాలో పెట్టుబడి పెడితే ఆ దేశంలో ఐదేళ్ల పాటు నివసించవచ్చు. అక్కడి నివాస ఖర్చులను భరించగలిగే ఆర్థిక స్తోమత ఉందనే ఆధారాలు చూపాల్సి ఉంటుంది.

2. మాల్టా
మాల్టా గోల్డెన్ వీసా పొందాలంటే అక్షరాలా కోటీ ఎనభై లక్షల రూపాయాలు వెచ్చించాలి. అక్కడి కరెన్సీ యూరోలలో 1.82 లక్షలు చెల్లించాలి. ఇందులో వివిధ రకాల ఫీజులతో పాటు సేవా కార్యక్రమాలకు చందా కూడా ఉంటుంది. ఈ వీసాతో మాల్టా వెళ్లి అక్కడే ఉండిపోవచ్చు. నెమ్మదిగా ఆ దేశ పౌరసత్వం పొందే వీలు ఉంటుంది.

3. గ్రీస్
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనువైన, ఆకర్షణీయ దేశం గ్రీస్.. ఈ దేశం ఆఫర్ చేస్తున్న గోల్డెన్ వీసా దక్కాలంటే 2.5 లక్షల యూరోలు (సుమారు రూ. 2.5 కోట్లు) వెచ్చించాల్సిందే. ఈ మొత్తాన్ని అక్కడి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెడితే కుటుంబంతో పాటు ఐదేళ్లు గ్రీస్ లో ఉండే అవకాశం లభిస్తుంది. యురోపియన్ దేశాల్లో వీసా లేకుండానే ప్రయాణించే వీలుకలుగుతుంది.

4. హంగేరి
గెస్ట్ ఇన్వెస్టర్ పోగ్రాం పేరుతో హంగేరి విదేశీయులకు రెసిడెన్షియల్ వీసా ఆఫర్ చేస్తోంది. ఈ వీసా ఖరీదు 2.5 లక్షల యూరోలు. అంటే మన రూపాయల్లో దాదాపు 2.5 కోట్లు. హంగేరిలో నివాసంతో పాటు ఈయూ దేశాల్లో వీసా లేకుండానే ప్రయాణించే వీలు కలుగుతుంది. ముఖ్యంగా ఈ వీసా దరఖాస్తులను అత్యంత వేగంగా ప్రాసెస్ చేస్తుంది. నిబంధనలన్నీ పాటించిన దరఖాస్తుదారులు కేవలం ఆరు వారాల్లోనే వీసా పొందే వీలుంటుంది.

5. ఇటలీ
ఇటలీలోని స్టార్టప్ కంపెనీల్లో 2.5 లక్షల యూరోలు (రూ.2.5 కోట్లు) పెట్టుబడి పెట్టడం ద్వారా గోల్డెన్ వీసా పొందవచ్చు. ఇటలీ పౌరసత్వం పొందేందుకు వీలుంటుంది. ఈ వీసాతో పదేళ్ల పాటు ఇటలీలో నివాసం ఉండవచ్చు. ఈయూ దేశాల్లో వీసా ఫ్రీ ప్రయాణంతో పాటు పన్నుల భారం నుంచి మినహాయింపు పొందే వీలుంటుంది.

6. వనౌటు
విదేశాలు ఆఫర్ చేస్తున్న గోల్డెన్ వీసాలలో కాస్త తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్నది వనౌటు మాత్రమే.. ఈ గోల్డెన్ వీసా కోసం 1.3 లక్షల అమెరికన్ డాలర్లు వెచ్చించాలి. అంటే.. సుమారు 11 లక్షల రూపాయలు మాత్రమే. కేవలం నెల లేదా రెండు నెలల్లో వనౌటు వీసా పొందవచ్చు. దీంతో 130 దేశాల్లో వీసా అక్కర్లేకుండానే ప్రయాణించే వీలుంటుంది.

7. డొమినికా
డొమినికా ఆఫర్ చేస్తున్న గోల్డెన్ వీసాతో ఆ దేశ పౌరసత్వం పొందవచ్చు. ఇందుకోసం 2 లక్షల అమెరికన్ డాలర్లు (రూ.1.71 కోట్లు) చెల్లించాల్సి ఉంటుంది. డోమినికా పౌరసత్వంతో ప్రపంచంలోని 140 దేశాల్లో వీసాతో పనిలేకుండా ప్రయాణించవచ్చు.

8. ఆంటిగ్వా, బార్బుడా
అంటిగ్వా, బార్బుడా పౌరసత్వాన్ని 2.3 లక్షల అమెరికన్ డాలర్ల (దాదాపు రూ.2 కోట్లు) తో కొనుక్కోవచ్చు. వీసా పొందాక నిర్ణీత కాలం ఆ దేశంలో నివసిస్తే పౌరసత్వం జారీ చేస్తుంది.

9.యూఏఈ
యూఏఈ గోల్డెన్ వీసా చాలా ఖరీదు.. ఏకంగా 2 మిలియన్ల యూఏఈ దిర్హామ్స్ (రూ.4.7 కోట్లు) వెచ్చిస్తే జీవితకాలం అక్కడే ఉండిపోవచ్చు. పన్నుల భారం నుంచి పూర్తిగా మినహాయింపు లభిస్తుంది. వివిధ రంగాల్లో నిపుణులైన భారతీయులకు ఒక లక్ష దిర్హామ్స్ (రూ.23 లక్షలు) తో గోల్డెన్ వీసా అందిస్తోంది. ఈ వీసా కేవలం నిపుణులకు మాత్రమేనని గుర్తించాలి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *