ఒక వ్యక్తి చనిపోయిన తర్వత మళ్లీ బ్రతకడం సాధ్యమేనా? ఒకటి రెండు సందర్భాల్లో గుండె ఆగిపోయిన కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ బ్రతికారంటూ ఒకటి రెండు సంఘటనలు వినిపించినా.. పూర్తిగా మరణించిన రోజుల తర్వాత మళ్లీ బ్రతకడం సాధ్యమేనా? ఈ సమయంలో… మాగ్జిమం జనాలు చెప్పే సమాధానానికి భిన్నమైన సమాధానం చెబుతోంది జర్మన్ కు చెందిన స్టార్టప్ కంపెనీ!
అవును… చనిపోయినప్పటికీ తిరిగి బతికించే అవకాశం కల్పిస్తానంటోంది జర్మన్ స్టార్టప్ కంపెనీ టుమారో బయో. వ్యక్తి చనిపోయిన తర్వాత వారి శరీరం, మెదడును క్రయోఫ్రీజరేషన్ ల్యాబ్ లో -196 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో భద్రపరచడంతో ఇది సాధ్యమవుతుందని అంటున్నారు.
మాజీ క్యాన్సర్ పరిశోధకుడు డాక్టర్ ఎమిల్ కెండ్జియోరా, ఇంజనీర్ ఫెర్నాండో అజెవెడో పిన్హీరో స్థాపించిన ఈ కంపెనీ.. చట్టబద్ధమైన మరణం తర్వాత అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయాలని ఎంచుకునే వ్యక్తుల కోసం దీర్ఘకాలిక క్రయోప్రెజర్వేషన్ సేవలను అందిస్తుంది. అది ఎప్పటివరకూ అంటే… భవిష్యత్తులో మెడికల్ టెక్నాలజీ అభివృద్ధి చెంది జీవ పునరుద్ధరణకు అవకాశం కలిగే వరకూ! దీనికి సంబంధించి ధరల పట్టిక కూడా విడుదలై ఉంది. ఇందులో భాగంగా.. పూర్తి శరీరాన్ని ఫ్రీజర్ చేయాలంటే 2 లక్షల డాలరు (సుమారు రూ.1.8 కోట్లు) కాగా.. మెదడుకు 78వేల డాలర్లు (సుమారు రూ.67.2 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది!
ఈ సందర్భంగా స్పందించిన డాక్టర్ ఎమిల్ కెండ్జియోరా… కంపెనీ ఇప్పటివరకూ 20 మానవ మృతదేహాలను, 10 పెంపుడు జంతువులను క్రయోప్రిజర్వ్ చేసినట్లు తెలిపారు. అంతేకాదు.. ఇప్పటివరకూ సుమారు 800 కంటే ఎక్కువ మంది సైన్ అప్ చేశారు! ఇదే సమయంలో… అమెరికా, యూరప్ అంతటా 1,000 మంది సైన్ అప్ లను చేరుకునే దిశగా ముందుకు కదులుతున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో… ఎలుకలలో అవయవ పునరుజ్జీవనానికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయని కెండ్జియోరా అన్నారు. 2023లో యూనివర్శిటీ ఆఫ్ మిన్నెసోటా ట్విన్ సిటీస్ పరిశోధకులు ఎలుక మూత్రపిండాలను క్రయోజెనిక్ గా సుమారు 100 రోజులు నిల్వ చేసి.. వాటిని తిరిగి వేడి చేసి, క్రయోప్రొటెక్టివ్ ద్రవాలను తొలగించి, వాటిని తిరిగి ఐదు ఎలుకలలోకి మార్పిడి చేయగా.. 30 రోజుల్లోపు అవి పూర్తి పనితీరు కనబరిచాయని తెలిపారు