పవిత్రమైన దేవాలయంలోనే దారుణం చోటుచేసుకుంది. ఆశీర్వాదం పేరుతో ఒక హిందూ పూజారి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని భారత సంతతికి చెందిన నటి, మిస్ గ్రాండ్ మలేషియా 2021 విజేత లిషాలినీ కనరన్ ఆరోపించడం తీవ్ర కలకలం రేపుతోంది. మలేషియాలోని సెపాంగ్‌లో ఉన్న మరియమ్మన్ ఆలయంలో గత నెల ఈ ఘటన జరగ్గా, బాధితురాలు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టడంతో వెలుగులోకి వచ్చింది.
సెపాంగ్ జిల్లా పోలీస్ చీఫ్ నార్హిజామ్ బహమన్ ఈ ఘటనపై స్పందించారు. నిందితుడు భారత జాతీయుడని, ఆలయంలోని ప్రధాన పూజారి అందుబాటులో లేకపోవడంతో తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్నాడని తెలిపారు. బాధితురాలిపై పవిత్ర జలం చల్లినట్లు నటించి, ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు వివరించారు. పరారీలో ఉన్న నిందిత పూజారి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
బాధితురాలు ఏం చెప్పిందంటే..
జూన్ 21న తాను ఒంటరిగా ఆలయానికి వెళ్లానని లిషాలినీ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రార్థనల అనంతరం పూజారి తనను కలిసి, భారత్ నుంచి తెచ్చిన పవిత్ర జలంతో ఆశీర్వదిస్తానని నమ్మించాడని తెలిపారు. ఇందుకోసం తన ప్రైవేట్ కార్యాలయానికి తీసుకెళ్లి, మొదట తనపై ఘాటైన ద్రవాన్ని చల్లాడని, ఆపై అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. దుస్తుల్లో చేతులు పెట్టి అనుచితంగా తాకాడని, తనతో లైంగికంగా కలిస్తే అది “దేవుడికి చేసే సేవ” అవుతుందని చెప్పి వేధించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనతో తాను షాక్‌కు గురై కదలలేకపోయానని, జూలై 4న పోలీసులకు ఫిర్యాదు చేశానని లిషాలినీ వివరించారు. అయితే, ఈ విషయాన్ని బయటపెట్టవద్దని, పెడితే నింద తనపైనే పడుతుందని విచారణ అధికారి తనను హెచ్చరించినట్లు ఆమె ఆరోపించారు. తాము ఆలయానికి వెళ్లేసరికే పూజారి పరారయ్యాడని, గతంలోనూ అతనిపై ఇలాంటి ఆరోపణలు వచ్చినా ఆలయ యాజమాన్యం పరువు కోసం విషయాన్ని కప్పిపుచ్చిందని ఆమె ఆరోపించారు. పవిత్ర స్థలంలో జరిగిన ఈ దారుణం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.