కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశంలోని పది ప్రధాన కార్మిక సంఘాలు, రైతు సంఘాలు నేడు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ దేశవ్యాప్త సమ్మె కారణంగా బ్యాంకింగ్, రవాణా, విద్యుత్, పోస్టల్ సహా పలు కీలక రంగాల సేవలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. సుమారు 25 కోట్ల మందికి పైగా కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటారని సంఘాల నేతలు అంచనా వేస్తున్నారు.
స్తంభించనున్న సేవలు ఇవే
ఈ సమ్మె ప్రభావం ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంపై ఎక్కువగా పడనుంది. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) బంద్కు మద్దతు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. దీంతో పాటు, బొగ్గు గనులు, కర్మాగారాలు, పోస్టల్ సేవలు కూడా స్తంభిస్తాయి. విద్యుత్ రంగానికి చెందిన 27 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నందున, విద్యుత్ సరఫరాలోనూ అంతరాయాలు ఏర్పడవచ్చని భావిస్తున్నారు.
ప్రజా రవాణా వ్యవస్థపైనా బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. అనేక నగరాల్లో ప్రభుత్వ బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు నిలిచిపోయే అవకాశం ఉంది. కేరళలో ఆర్టీసీ సమ్మె నోటీసు అందలేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కార్మికులు సమ్మెలో పాల్గొంటారని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. రైల్వే యూనియన్లు అధికారికంగా సమ్మెలో పాల్గొననప్పటికీ, నిరసనకారులు రైల్వే ట్రాక్ల వద్ద ఆందోళనలు చేపట్టే అవకాశం ఉన్నందున కొన్ని ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు జాప్యం జరగవచ్చు. అయితే, పాఠశాలలు, కళాశాలలకు ఎలాంటి సెలవు ప్రకటించనందున అవి యథావిధిగా పనిచేస్తాయి.
సమ్మెకు కారణాలు ఇవే
ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలు, కార్మిక చట్టాల్లో మార్పులకు వ్యతిరేకంగా ఈ బంద్కు పిలుపునిచ్చినట్టు కార్మిక సంఘాల సమాఖ్య తెలిపింది. కొత్త లేబర్ కోడ్లు యాజమాన్యాలకు అనుకూలంగా ఉంటూ, కార్మికుల హక్కులను కాలరాసేలా ఉన్నాయని వారు ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ఉద్యోగాల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాలను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పెరుగుతున్న నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదల, వేతనాల కోత వంటి సమస్యలపై కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ 17 డిమాండ్ల సాధన కోసమే ఈ సమ్మె చేపడుతున్నట్లు కార్మిక సంఘాల నేతలు తెలిపారు. ఈ బంద్కు సంయుక్త కిసాన్ మోర్చా కూడా మద్దతు ప్రకటించడంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ నిరసనలు పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది.