మీ డబ్బు రెట్టింపు చేస్తామంటూ… కోట్లు వసూలు చేసి దంపతుల పరార్

V. Sai Krishna Reddy
2 Min Read

బెంగళూరులో ‘ఫిర్ హేరా ఫేరీ’ సినిమాను తలపించిన భారీ మోసం
అధిక రాబడి ఆశ చూపి వందల మంది నుంచి కోట్లు వసూలు
‘ఏ&ఏ చిట్స్ అండ్ ఫైనాన్స్’ పేరుతో కేరళ దంపతుల టోకరా
నమ్మకం కోసం మొదట చెల్లింపులు, తర్వాత బోర్డు తిప్పేసి పరారీ
ఆస్తులు అమ్ముకుని పరారైన టామీ, షైనీ దంపతులు
బాధితుల ఫిర్యాదుతో పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం
“21 రోజుల్లో డబ్బు డబుల్”… ఈ డైలాగ్ ‘ఫిర్ హేరా ఫేరీ’ సినిమాలో కోటీశ్వరులు కావాలనుకున్న ముగ్గురిని నిండా ముంచింది. ఇప్పుడు అదే తరహా మోసం బెంగళూరులో నిజంగా జరిగి వందల కుటుంబాలను వీధిన పడేసింది. అధిక వడ్డీ ఆశ చూపి వందల మంది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఓ కేరళ జంట ఉడాయించింది. బాధితుల ఫిర్యాదుతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన టామీ, షైనీ దంపతులు గత 25 ఏళ్లుగా బెంగళూరులో నివసిస్తున్నారు. వీరు ‘ఏ&ఏ చిట్స్ అండ్ ఫైనాన్స్’ పేరుతో ఒక చిట్ ఫండ్ సంస్థను ప్రారంభించారు. తమ వద్ద పెట్టుబడి పెడితే 15 నుంచి 20 శాతం వరకు అధిక రాబడి ఇస్తామని ప్రజలను నమ్మించారు. వీరి మాటలు నమ్మిన ఎంతోమంది తమ కష్టార్జితాన్ని ఈ స్కీమ్‌లో పెట్టారు.

మొదట్లో అందరికీ నమ్మకం కలిగించేందుకు చెప్పినట్లుగానే కొన్నాళ్లపాటు రాబడిని సక్రమంగా చెల్లించారు. దీంతో మరింత మంది తమ పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్య ఖర్చుల కోసం దాచుకున్న డబ్బును, చివరికి ఆస్తులు అమ్మి మరీ పెట్టుబడులు పెట్టారు. ఇలా వందల మంది నుంచి కోట్లాది రూపాయలు జమ చేసుకున్న తర్వాత ఆ దంపతులు అసలు స్వరూపం బయటపెట్టారు. ఇటీవల హఠాత్తుగా చెల్లింపులు ఆపేశారు. బాధితులు సంప్రదించేందుకు ప్రయత్నించగా వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి. కార్యాలయానికి తాళం వేసి కనిపించారు.

మోసపోయామని గ్రహించిన సుమారు 300 మంది బాధితులు రామ్మూర్తి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ దంపతులు పరారయ్యే ముందు తమ చర, స్థిరాస్తులను అమ్ముకున్నట్లు ప్రాథమికంగా తేలింది. సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు కూడా సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, టామీ, షైనీ దంపతుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *