ఎల్లారెడ్డి జూలై- 7(ప్రజా జ్యోతి)
సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం అంటూ చెప్పిన ప్రభుత్వం,అధికారులు హాస్టళ్లను పట్టించుకోవడం లేదని పలు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు రోడ్డుపై బైటయించారు.వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు సోమవారం ఎల్లారెడ్డి -బాన్సువాడ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ…సాంఘిక సంక్షేమ గిరిజన బాలికల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు గత కొన్ని రోజుల నుంచి అన్నం తినేటప్పుడు తరచుగా పురుగులు వస్తున్నాయని,అదేవిధంగా కూరలు కూడా బాగాలేవని ఈ విషయంపై పలుమార్లు ప్రిన్సిపల్, అధ్యాపకుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ ఏమాత్రం పట్టించుకోవడంలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.హాస్టళ్లో మరుగుదొడ్ల,స్నానలకు కూడా నీళ్లు రావడం లేదని,తప్పని పరిస్థితిలో వచ్చి రోడ్డుపై బైఠాయించిన నిరసన వ్యక్తం చేస్తున్నామని విద్యార్థులు వాపోయారు. భోజనం, నీళ్ల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో ఎల్లారెడ్డి బాన్సువాడ ప్రధాన రహదారిపై వాహనాలు గంటల తరబడి భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి తహసిల్దార్ ప్రేమ్ కుమార్ రోడ్డుపై బైఠాయించిన విద్యార్థినులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు తమ ఆందోళనను విరమించారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.