ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ప్రవాహం రోజురోజుకూ పెరుగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి ఈరోజు 1,30,780 క్యూసెక్కుల వరద శ్రీశైలం జలాశయానికి చేరుకుంటోంది. శ్రీశైలం నుంచి ఔట్ ఫ్లో 67,399 క్యూసెక్కులుగా ఉంది.
ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,084 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్‌కు అధికారులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 878.40 అడుగులకు చేరింది. ఒక్క రోజు వ్యవధిలోనే ఐదు అడుగుల నీటి మట్టం పెరిగింది.
నిన్న 873.90 అడుగులుగా నీటి మట్టం ఉండగా, ఈ రోజు ఐదు అడుగులు పెరిగింది. వరద నీటి ప్రవాహం ఇదే విధంగా కొనసాగితే మరో 24 గంటల్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 179.89 టీఎంసీలకు చేరింది.