ఓలా, ఊబర్ కొత్త రూల్స్… డ్రైవర్లు, ప్రయాణికులు తప్పకుండా తెలుసుకోవాలి!

V. Sai Krishna Reddy
2 Min Read

దేశవ్యాప్తంగా ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి క్యాబ్, బైక్ ట్యాక్సీ సేవలను వినియోగించే వారికి కేంద్ర ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. ప్రయాణికుల జేబుపై భారం మోపుతూనే, కొన్ని వర్గాలకు ఊరట కల్పించేలా ‘మోటారు వాహన అగ్రిగేటర్ మార్గదర్శకాలు 2025’ పేరుతో కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ మార్పుల వల్ల క్యాబ్ చార్జీలు పెరగనుండగా, ఎప్పటినుంచో వివాదాల్లో ఉన్న బైక్ ట్యాక్సీలకు చట్టబద్ధత లభించింది.

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం, రద్దీ సమయాల్లో (పీక్ అవర్స్) బేస్ ఫేర్‌పై రెట్టింపు వరకు సర్జ్ ప్రైసింగ్ వసూలు చేసుకునేందుకు అగ్రిగేటర్ కంపెనీలకు అనుమతి లభించింది. ఇప్పటివరకు ఇది 1.5 రెట్లు మాత్రమే ఉండేది. అదే సమయంలో, రద్దీ లేని సమయాల్లో కనీస ఛార్జీలో 50% కంటే తగ్గకుండా వసూలు చేయాలని స్పష్టం చేసింది. బేస్ ఫేర్ కింద కనీసం 3 కిలోమీటర్ల దూరం ప్రయాణాన్ని కవర్ చేయాలని కూడా నిర్దేశించింది.

మరో ముఖ్యమైన మార్పుగా, రైడ్‌ను అంగీకరించిన తర్వాత సరైన కారణం లేకుండా రద్దు చేసే డ్రైవర్లకు, అలాగే బుక్ చేశాక రద్దు చేసుకునే ప్రయాణికులకు కూడా జరిమానా విధించనున్నారు. మొత్తం ఛార్జీలో 10 శాతం లేదా గరిష్ఠంగా రూ. 100 వరకు పెనాల్టీ వర్తిస్తుంది.

ఈ నిబంధనలు డ్రైవర్లకు కొంత మేలు చేసేలా ఉన్నాయి. సొంత వాహనం నడిపే డ్రైవర్లకు మొత్తం ఛార్జీలో కనీసం 80 శాతం వాటా చెల్లించాలని, కంపెనీకి చెందిన వాహనాలు నడిపేవారికి 60 శాతం వాటా ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అదే సమయంలో, బైక్ ట్యాక్సీ ఆపరేటర్లకు ఈ మార్గదర్శకాలు అతిపెద్ద ఊరటను ఇచ్చాయి. ప్రైవేట్ రిజిస్ట్రేషన్ (నాన్-ట్రాన్స్‌పోర్ట్) కలిగిన ద్విచక్ర వాహనాలను కూడా ప్రయాణికుల కోసం ఉపయోగించేందుకు అధికారికంగా అనుమతి ఇచ్చింది. దీనివల్ల కర్ణాటక వంటి రాష్ట్రాల్లో నిషేధంతో ఇబ్బందులు పడుతున్న ర్యాపిడో, ఊబర్ మోటో వంటి సంస్థలకు మార్గం సుగమమైంది. ఈ కొత్త నిబంధనలను మూడు నెలల్లోగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ఈ నిర్ణయాన్ని పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *