అనకాపల్లి జిల్లాలో చిట్టీల మోసం తీవ్ర కలకలం రేపింది. సుమారు 300 కుటుంబాల నుంచి రూ.4 కోట్లు వసూలు చేసిన ఓ మహిళ పరారవ్వడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తాము మోసపోయామని, న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు దిగారు. కె.కోటపాడు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన చేపట్టిన బాధితుల్లో కొందరు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
వివరాల్లోకి వెళితే… కె.కోటపాడు మండలం చౌడువాడ గ్రామానికి చెందిన పెదిరెడ్ల పద్మజ అలియాస్ చల్లపల్లి పద్మ, సుమారు 15 ఏళ్ల క్రితం గ్రామంలో స్థిరపడింది. మొదట పప్పుల చీటీలు, బంగారు కాసుల చీటీల పేరుతో స్థానికులకు దగ్గరైంది. అందరితో నమ్మకంగా ఉంటూ వారి విశ్వాసాన్ని చూరగొంది. ఆ తర్వాత రూ.లక్ష నుంచి రూ.20 లక్షల వరకు పెద్ద మొత్తంలో చిట్టీలు ప్రారంభించింది. అనేక సంవత్సరాలుగా నమ్మకంగా వ్యవహరించడంతో గ్రామస్థులు తమ కష్టార్జితాన్ని ఆమె వద్ద చిట్టీల రూపంలో దాచుకున్నారు. చిట్టీ పాడిన తర్వాత వచ్చిన డబ్బును కూడా అధిక వడ్డీ ఆశతో ఆమె వద్దే ఉంచేవారు.
ఇలా సుమారు 300 కుటుంబాల నుంచి దాదాపు రూ.4 కోట్లు సమీకరించిన పద్మజ, వారం రోజుల క్రితం తన కుమారుడితో కలిసి ఆరోగ్యం బాగోలేదనే కారణంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. వెళ్లిన రెండు రోజుల పాటు ఆమె ఫోన్ పనిచేసినా, ఆ తర్వాత స్విచ్ ఆఫ్ రావడంతో బాధితుల్లో ఆందోళన మొదలైంది. తాము మోసపోయామని గ్రహించిన వారంతా ఏకమై కె.కోటపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా నిందితురాలిని పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. తమ గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. మోసగించిన పద్మజను వెంటనే అరెస్టు చేసి, తమ డబ్బు తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కొందరు బాధితులు తీవ్ర ఆవేశంతో తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో పోలీసులు అప్రమత్తమై వారిని నిలువరించారు.
పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇళ్ల నిర్మాణం వంటి అవసరాల కోసం రూపాయి రూపాయి కూడబెట్టుకుంటే, నమ్మకంగా ఉంటూనే నిండా ముంచిందని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. డబ్బు తిరిగిరాకపోతే తాము ఆర్థికంగా చితికిపోతామని వాపోతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నప్పటికీ, వారి తీరుపై బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.