అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతదేశపు ప్రాచీన సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ప్రపంచవ్యాప్తంగా నేడు 1300 నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, అందుకు సంబంధించిన వేడుకలను భారత్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమాల ద్వారా యోగా ప్రాముఖ్యతను మరింతగా ప్రచారం చేయనుంది.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సాంస్కృతిక విభాగమైన ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్) నిన్న విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం ఈ సందర్భంగా పాకిస్థాన్‌లోని భారత హైకమిషన్ కూడా ఇస్లామాబాద్‌లో ఒక యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. “పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున యోగా కార్యక్రమాలు జరుగుతున్న ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశాన్ని మేం కవర్ చేయనున్నాం. అమెరికా వంటి కొన్ని దేశాల్లో, వివిధ నగరాల్లో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం” అని ఐసీసీఆర్ డైరెక్టర్ జనరల్ కె. నందిని సింగ్లా ఒక ప్రకటనలో తెలిపారు.
21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐసీసీఆర్ 191 దేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలను, వేడుకలను నిర్వహించనుందని, వివిధ దేశాల్లోని పలు నగరాలను కలుపుతూ 1300 ప్రదేశాల్లో 2000కు పైగా కార్యక్రమాలు జరుగుతాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అంతేకాకుండా బ్రెజిల్, అర్జెంటీనా, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, మలేసియా, శ్రీలంక, ఇండోనేషియా, సింగపూర్, దక్షిణ కొరియా సహా 15 దేశాలకు చెందిన 17 మంది యోగా గురువులు, అభ్యాసకులు భారతదేశ వ్యాప్తంగా యోగా దినోత్సవ కార్యక్రమాలకు నాయకత్వం వహించేలా ‘యోగా బంధన్’ అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఐసీసీఆర్ నిర్వహిస్తోందని సింగ్లా తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్, కుతుబ్ మినార్, పురానా ఖిల్లా, హుమాయున్ సమాధి వద్ద ఈ విదేశీ యోగా గురువుల నేతృత్వంలో యోగా కార్యక్రమాలు జరుగుతాయని, అలాగే లక్నో, అయోధ్య, వారణాసి, జైపూర్, జోధ్‌పూర్, భోపాల్, గ్వాలియర్ తదితర నగరాల్లోని చారిత్రక ప్రదేశాల్లో కూడా ఇలాంటి ‘యోగా బంధన్’ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆమె వివరించారు.
2025 అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ‘ఒకే భూమి, ఒకే ఆరోగ్యం’ అనే ఇతివృత్తాన్ని ఎంచుకున్నట్లు ఐసీసీఆర్ నొక్కి చెప్పింది. ఈ థీమ్ ఆరోగ్యం, సుస్థిరత, పర్యావరణం మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని ప్రతిబింబిస్తుందని, జీ20 అధ్యక్ష పదవి సమయంలో భారత్ ప్రతిపాదించిన “ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు” దార్శనికతకు అనుగుణంగా ఉందని పేర్కొంది. వివిధ దేశాల్లోని భారతదేశానికి చెందిన 37 సాంస్కృతిక కేంద్రాలు కూడా గత 100 రోజులుగా అనేక యోగా కార్యక్రమాలను నిర్వహించాయని సింగ్లా తెలిపారు.
విదేశాల్లో యోగాకు పెరుగుతున్న ఆదరణ గురించి ఆమె మాట్లాడుతూ “ఎంపీలు, శాసనసభ్యులు, పోలీసు అధికారులు, న్యాయమూర్తులు వంటి ప్రముఖులు కూడా విదేశాల్లో యోగా నేర్చుకుంటున్నారు” అని అన్నారు. విదేశాల్లో చాలా మంది ఆరోగ్యంగా ఉండటానికి, ఒత్తిడిని జయించడానికి తమ దైనందిన జీవితంలో యోగాను అలవరచుకుంటున్నారని, యోగా “నిజంగా ఒక ప్రపంచ ఉద్యమంగా మారింది” అని సింగ్లా పేర్కొన్నారు.