భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలమైంది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. శనివారం రాత్రి కురిసిన వర్షానికి ఘజియాబాద్ లోని పోలీస్ స్టేషన్ కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకుని ఎస్సై దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఏసీపీ అంకుర్ విహార్ ఆఫీస్ లో వీరేంద్ర మిశ్రా(58) ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి భారీ వర్షం, పెనుగాలులకు స్టేషన్ పైకప్పు కుప్పకూలింది.
వర్షం కారణంగా స్టేషన్ లోనే ఉండిపోయిన మిశ్రా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. శిథిలాలు మీదపడడంతో తీవ్ర గాయాలపాలై మిశ్రా మరణించారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. ఢిల్లీలో శనివారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5.30 వరకు 81.2 మిల్లీ మీటర్ల భారీ వర్షం కురిసింది. దీంతో మోతీ బాగ్, మింటో రోడ్, దీన్ దయాల్ ఉపాధ్యాయ్ మార్గ్, ఢిల్లీ కంటోన్మెంట్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి.