పాకిస్థాన్-చైనా మధ్య కీలక ఒప్పందం

V. Sai Krishna Reddy
2 Min Read

భారతదేశంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాయాదితో చైనా కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిణామాన్ని పాకిస్థాన్ తన విజయాలలో ఒకటిగా భావిస్తోంది. వ్యవసాయం, పరిశ్రమలు సహా అనేక రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడానికి పాకిస్థాన్ అంగీకరించింది. పాక్ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో మంగళవారం పాకిస్థాన్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ భేటీ అయ్యారు. అనంతరం చైనాతో వాణిజ్య ఒప్పందం గురించి ప్రకటన చేశారు.

చైనాతో జరిగిన సమావేశంలో ఆర్థిక ఒప్పందాన్ని బలోపేతం చేసుకోవడమే కాకుండా చైనా, పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ)ని ఆఫ్ఘనిస్థాన్‌కు విస్తరించాలని కూడా నిర్ణయించినట్లు పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండు దేశాలు స్థిరత్వం, శాంతి కాపాడుకోవడంపైనా చర్చించాయని వెల్లడించింది. వాణిజ్యం, పెట్టుబడి, వ్యవసాయం, పారిశ్రామికీకరణ, ఇతర రంగాలలో సహకారాన్ని పెంచుకోవడానికి చైనా, పాకిస్థాన్ అంగీకరించాయని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ సమావేశంలో సీపీఈసీ విస్తరణపైనా నిర్ణయం తీసుకున్నట్లు పాక్ తెలిపింది. చైనా నుంచి పాక్ బలూచిస్థాన్‌లోని గ్వదర్ వరకు సాగే సీపెక్ చాలా కీలకమైనదని చెబుతున్నారు. చైనా నౌకలు వర్షియన్ సింధు శాఖ ద్వారా పయనిస్తూ ఎగుమతి, దిగుమతులు నిర్వహిస్తాయి. ఆ సింధు శాఖ మార్గాన్ని కాపాడుకోవడానికి సీపెక్‌లో భాగంగా గ్వదర్ రేవు నిర్మిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే చైనా నౌకలు సులక్కా జలసంధిపై ఆధారపడటం తగ్గిపోతుందని చెబుతున్నారు.

భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తర్వాత పాక్ మంత్రి చేపట్టిన తొలి చైనా యాత్ర ఇదే. పాకిస్థాన్, చైనా, ఆఫ్ఘానిస్థాన్‌లు ప్రాంతీయ శాంతి, సుస్థిరత అభివృద్ధికి కట్టుబడి ఉంటాయని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దౌత్య సంబంధాలు కొనసాగించడం, కమ్యూనికేషన్లను బలోపేతం చేసుకోవడం, అభివృద్ధి వంటివి కీలకమైనవిగా చెప్పారు. చైనా – పాక్ ఆర్థిక నడవాను ఆఫ్ఘానిస్థాన్ వరకు పొడిగించేందుకు అంగీకరించడం జరిగిందని వెల్లడించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *