సైనిక ఘర్షణల అనంతరం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తొలిసారిగా జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పాకిస్థాన్ వద్ద ఉన్న అణ్వాయుధాల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యతారహితంగా ప్రవర్తించే ఒక దేశం చేతిలో అణ్వాయుధాలు ఉండటం ప్రపంచ భద్రతకు ముప్పు కలిగిస్తుందని, ఈ విషయంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ జోక్యం చేసుకుని పాకిస్థాన్ అణ్వాయుధాలను తన పర్యవేక్షణలోకి తీసుకోవాలని ఆయన కోరారు. జమ్ముకశ్మీర్‌కు చేరుకున్న రాజ్‌నాథ్ సింగ్‌కు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్వాగతం పలికారు.
అనంతరం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదంపై భారత్ ఉక్కుపాదం మోపుతుందని స్పష్టం చేశారు. “ఉగ్రవాద శిబిరాలు ఏ మూలన ఉన్నా వాటిని నాశనం చేస్తాం. భారత్‌పై జరిగే ప్రతి ఉగ్రదాడిని యుద్ధ చర్యగానే పరిగణిస్తాం” అని ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించారు. దేశ రక్షణ కోసం, ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు శిరస్సు వంచి నివాళులర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
“ఆపరేషన్ సిందూర్ అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదు, అదొక దృఢ సంకల్పం, నిబద్ధత” అని రాజ్‌నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అద్భుతంగా పోరాడుతున్న మన సైనిక దళాల మధ్య ఉండటం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఇటీవలి పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారికి కూడా రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు.
తన పర్యటనలో భాగంగా, పాకిస్థాన్ సైన్యం జరిపిన షెల్లింగ్‌లో దెబ్బతిన్న సరిహద్దు ప్రాంతాలను రాజ్‌నాథ్ సింగ్ సందర్శించారు. క్షేత్రస్థాయిలో సైనిక దళాల సంసిద్ధతను, భద్రతా ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఇందులో భాగంగా శ్రీనగర్‌లోని చినార్ కోర్ (15వ కోర్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి, ఆర్మీ, వాయుసేన ఉన్నతాధికారులు, సిబ్బందితో ఆయన సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించనున్నారు.