కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో శనివారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రాత్రి వేళ చల్లగాలి కోసం పెట్టుకున్న కూలర్ ఇద్దరి ప్రాణాలను బలిగొంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా కూలర్ బాడీకి కరెంట్ పాసవడంతో కూలర్ పక్కనే నిద్రిస్తున్న బాలికకు షాక్ తగిలింది. బాలిక పక్కనే పడుకున్న తల్లి కూడా షాక్ కు గురయింది. షాక్ తీవ్రతకు తల్లీకూతుళ్లు ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. జుక్కల్ మండలంలోని గుల్లా తండాలో ఈ దారుణం చోటుచేసుకుంది.
జుక్కల్ పోలీసులు, గుల్లా తండా వాసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన ప్రహ్లాద్, శాంకబాయి దంపతులకు ఒక కొడుకు, ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు హైదరాబాద్ లో మిగతా పిల్లలు తండాలోనే చదువుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ప్రహ్లాద్ హైదరాబాద్ కు వెళ్లగా ఇద్దరు పిల్లలతో శాంకబాయి ఇంట్లోనే ఉంది. రాత్రి భోజనం తర్వాత కూలర్ ఆన్ చేసి అందరూ నిద్రపోయారు. కూలర్ పక్కనే పడుకున్న శాంకబాయి చిన్న కూతురు శ్రీవాణి నిద్రలో కదలడంతో కాలు కూలర్ కు తగిలింది.
దీంతో శ్రీవాణికి షాక్ తగిలింది. శ్రీవాణి పక్కనే పడుకున్న శాంకబాయికి కూడా షాక్ తగిలి ఇద్దరూ చనిపోయారు. కాస్త దూరంగా పడుకున్న శాంకబాయి కుమారుడు ఉదయం నిద్ర లేచి చూసేసరికి తల్లి, చెల్లి ఇద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. చుట్టుపక్కల వారికి విషయం చెప్పడంతో వారు వచ్చి చూడగా అప్పటికే శాంకబాయి, శ్రీవాణి చనిపోయారు. తండావాసుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యుదాఘాతానికి కారణమైన కూలర్ స్థానికంగా తయారుచేసిన ఇనుప కూలర్ కావడంతోనే షాక్ తీవ్రత ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు.